సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను గెలవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విపరీతమైన జోష్‌లో ఉన్నాడు. టీమిండియా ఛేజింగ్ చేస్తున్న క్రమంలో డగౌట్‌లో ఉండి ఉత్సాహపరిచిన కోహ్లి.. ఆ సంతోషాన్ని మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో పంచుకున్నాడు. ‘ టీ20 క్రికెట్‌లో ఒక జట్టుగా చాలా బాగా ఆడాం. మా జట్టులో గత మ్యాచ్‌లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు లేరు(షమీ, జడేజాలను ఉద్దేశించి). కీలక ఆటగాళ్లైన ఆ ఇద్దరూ లేకుండానే గెలిచాం. ఇంతకంటే ఏం కావాలి. ఈ ప్రదర్శన నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారికి వారి వ్యూహాలు ఏమిటో తెలుసు. ముఖ్యంగా హార్దిక్, శ్రేయస్‌లు 14 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. దాంతో వారు వ్యూహ రచన సరైన దిశలో సాగింది. నటరాజన్ ప్రదర్శన అసాధారణం. శార్దూల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. శిఖర్ హాఫ్ సెంచరీ చేసి మంచి ఆరంభాన్ని ఇస్తే, హార్దిక్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. (సెకండ్ చాన్స్ ఇవ్వని కోహ్లి..!)
ఇది కచ్చితంగా సమష్టి విజయం. హార్దిక్ శక్తి సామర్థ్యాలు అమోఘం. 2016లో మా జట్టులోకి రావడానికి హార్దిక్‌లోని అపరమైన సామర్థ్యం కల్గి ఉండటమే. ఇటీవల కాలంలో హార్దిక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఫినిషర్‌గా ఇదే సరైన సమయమని హార్దిక్ గుర్తించాడు. అతని స్కిల్స్‌తో హార్దిక్ ఎక్కడో ఉన్నాడు. ఆఖరి టీ20 మ్యాచ్‌కు ఆసక్తికరంగానే ఉంటుంది. మా అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. నేను ఫైన్‌లెగ్ పైనుంచి స్కూప్ షాట్ ఆడటం చాలా సరదాగా అనిపించింది. అది నాకే ఆశ్చర్యం కల్గించింది. ఈ విషయాన్ని ఏబీ డివిలియర్స్‌కు మెసెజ్ చేస్తా. దాని గురించి ఏబీ ఏమి అనుకుంటున్నాడో తెలుసుకుంటా’ అని కోహ్లి తెలిపాడు. సాధారణంగా స్కూప్ షాట్లను ఏబీ డివిలియర్స్ ఆడతాడనే విషయం మనకు తెలిసిందే. (హార్దిక్ బాదుడు.. టీమిండియాదే సిరీస్)
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్ టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. శిఖర్ ధావన్(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్ రాహుల్(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా(42 నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(12 నాటౌట్; 5 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) లు రాణించి జట్టును గెలిపించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీకి తోడూ స్మిత్ కూడా రాణించడంతో ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment