No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Oct 28 2024 12:13 AM | Last Updated on Mon, Oct 28 2024 12:13 AM

-

నెల్లూరు(దర్గామిట్ట): త్వరలోనే జిల్లాలో విమానాశ్రయం పనులు ప్రారంభిస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆయన మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌తో కలిసి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలో రైస్‌ మిల్లులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రైస్‌మిల్స్‌ ఉన్న ఏరియాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉందన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనల మేరకు ఆ రైస్‌మిల్లులను దూర ప్రాంతాలకు తరలించాల్సి ఉందన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ సమస్యపై మూడు అసోసియేషన్లతో చర్చించినట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వారికి ఎటువంటి నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో చర్చించి ఏర్పాటు చేసుకోవాలన్నారు. కిసాన్‌ ఎస్‌ఈజెడ్‌, కృష్ణపట్నం పోర్ట్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. వ్యాపారస్తుల్ని ప్రోత్సహించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకే రైస్‌మిల్లర్ల యజమానులు, అసోసియేషన్‌ నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రోడ్డు, రైలు, విమాన, ఓడరేవు మార్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. నెల్లూరుకు విమానయానం అవసరం ఉందన్నారు. కృష్ణపట్నం పోర్టు, ఇంకా మరికొన్ని పోర్టులు కూడా వచ్చేశాయన్నారు. వాటిలో కార్గో చాలా ముఖ్యమైందన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్‌ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామన్నారు. ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు నేడు నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయన్నారు. జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విమానాశ్రయానికి 1,379 ఎకరాలు అవసరమని గుర్తించామని చెప్పారు. అయితే ఇంకా భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో చర్చిస్తామని తెలిపారు. త్వరలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి ఆనం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement