కాగుతున్న వంట నూనెల ధరలు | - | Sakshi
Sakshi News home page

కాగుతున్న వంట నూనెల ధరలు

Published Mon, Oct 28 2024 12:13 AM | Last Updated on Mon, Oct 28 2024 12:13 AM

కాగుతున్న వంట నూనెల ధరలు

కాగుతున్న వంట నూనెల ధరలు

మూడు రోజుల్లో 15 లీటర్ల డబ్బాపై రూ.270 పెరుగుదల

కావలి: పండగకు ముందు నూనె ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తున్నాయి. వివిధ రకాల నూనెల ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ధరలు పెరగడంతో ప్రజల వంటగది బడ్జెట్‌ను మరింతగా పెంచేసినట్లు అయింది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ధరలు పెరిగాయని అధికారులు సమర్ధించుకుంటున్నారు. ముడి పామాయిల్‌, సోయాబీన్‌, సన్‌ ఫ్లవర్‌ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచింది. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు చెబుతున్నారు. దీపావళి పండగకు ముందు వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో రూ.100 ఉన్న లీటర్‌ పామాయిల్‌ ధర రూ.137కు చేరగా, సోయాబీన్‌ రూ.120 నుంచి రూ.148, సన్‌ఫ్లవర్‌ రూ.120 నుంచి రూ.149, ఆవ నూనె రూ.140 నుంచి రూ.181, వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.184 మేర పెరిగాయి. కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రస్తుతం పండగల సమయంలో సామాన్యులపై మరో భారం పడింది. వంట నూనెలపై కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో వాటి ధరలు అమాంతంగా పెరిగాయి. 15 లీటర్ల పామాయిల్‌ డబ్బా ధర శుక్రవారం వరకు రూ.1,730 ఉండగా, శనివారానికి రూ.1,950, ఆదివారానికి రూ.2,000 వేలు దాటింది. కిలో ప్యాకెట్‌ ధర రూ.108 నుంచి రూ.125కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కిలో ఆయిల్‌ ప్యాకెట్‌కు అదనంగా రూ.5 పెంచి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వంట నూనెల ధరల పెంపుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న తమపై ఈ భారం మోపడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. వంటింటి బడ్జెట్‌ ఒక్కసారిగా పెరిగిందని సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు, హోటల్‌ నిర్వాహకులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement