ఇద్దరు ఘరానా దొంగల అరెస్ట్
కందుకూరు: ఇద్దరు ఘరానా దొంగల్ని వలేటివారిపాళెం పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం వివరాలు వెల్లడించారు. వలేటివారిపాళెం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మద్దులూరి ప్రభాకర్ ఇంట్లో ఈనెల 7వ తేదీన చోరీ జరిగింది. దొంగలు పట్టపగలు బంగారు నగలు అపహరించారు. సీసీ టీవీ ఫులేజీ ఆధారంగా గుంటూరు నగరంలోని శారదా కాలనీకి చెందిన చిల్లర సురేష్, కావలిలోని బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన సయ్యద్ ఫయాజ్‌లు దొంగతనం చేసినట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి 110 గ్రాముల బంగారు ఆభరణాలు, 900 గ్రాముల వెండితోపాటు, యమహా ఎఫ్‌జెడ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు పాత నేరస్తులుగా తేలింది. గత జూన్‌లో వలేటివారిపాళెం మండలంలోనే బడేవారిపాళెం గ్రామంలో పొడపాటి రమణమ్మ ఇంట్లో నాలుగు సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ షాపులో సుమారు కేజీ వెండిని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు సురేష్‌పై పలు జిల్లాల్లో 15 దొంగతనం, గంజాయి కేసులు, సయ్యద్ ఫయాజ్‌పై ఐదు గంజాయి, దొంగతనం కేసులున్నట్లు బయటపడింది. మొత్తంగా వారి నుంచి రూ.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన వలేటివారిపాళెం ఎస్సై మరిడినాయుడు, కానిస్టేబుళ్లు జె.మునికృష్ణ, ఎన్.కిశోర్, బి.మహేంద్రను అభినందించారు. సమావేశంలో గుడ్లూరు సీఐ జి.మంగారావు పాల్గొన్నారు.
రూ.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో కేసులు
Comments
Please login to add a commentAdd a comment