లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
నెల్లూరు(లీగల్): లారీలో ప్రయాణిస్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన పప్పర్తి సుబ్బరాయుడు అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.22 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సి.సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2020 సంవత్సరం మే నెలలో 14 ఏళ్ల బాలిక, ఆమె చిన్నాన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద లారీ ఎక్కారు. డ్రైవర్ సుబ్బరాయుడు సంగం వద్ద లారీని ఆపి హోటల్లో టిఫిన్ ఉందేమో కనుక్కోవాలని బాలిక చిన్నాన్నను పంపాడు. అతను వెళ్లగా సుబ్బరాయుడు వేగంగా లారీని కృష్ణపట్నం పోర్టు వైపునకు తీసుకెళ్లాడు. జాతీయ రహదారి పక్కన ఆపి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె చిన్నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు నిందితుడికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఐటీడీఏ విద్యార్థులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని జన జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్న ంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు నెల్లూరు ఐటీడీఏ తరఫున 60 మంది విద్యార్థులను పంపామని ప్రాజెక్ట్ అధికారిణి పరిమళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి వారంరోజులపాటు జిల్లాస్థాయిలో క్రీడా, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశామన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను శనివారం నుంచి 26వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపామన్నారు. శారీ పెయింటింగ్, మిల్లెట్ పౌడర్, బిస్కెట్ తయారు చేసే వారిని సైతం పోటీలకు పంపుతున్నామని వివరించారు.
విద్యార్థినిపై కర్రతో దాడి
మర్రిపాడు: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పదో తరగతి చదువుతున్న రెహనా అనే విద్యార్థిపై అదే గ్రామానికి చెందిన చెరుకూరి మదర్ సాహెబ్ కర్రతో దాడి చేసి గాయపరిచాడు. బాలికను కుటుంబసభ్యులు ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ ఘటనపై పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. వివరాలు.. రెహనా, మదర్ సాహెబ్ కుటుంబాల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రెహనా తన ఇంట్లో హోంవర్క్ చేసుకుంటుండగా మదర్ సాహెబ్ అక్కడికి వెళ్లి అసభ్యంగా తిట్టి కర్రతో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
కావలి: కావలి రూరల్ మండలం మోర్లవారిపాళెం గ్రామానికి చెందిన కట్టా ప్రభాకర్ (43) అనే గిరిజన కౌలు రైతు విద్యుత్ షాక్‌తో శుక్రవారం మృతిచెందాడు. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ప్రభాకర్ మూడెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ చెడిపోవడంతో దానిని వేసి ఆన్ చేశాడు. వెంటనే విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. సమీపంలోని వారు చికిత్స నిమిత్తం కావలిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
పెన్షన్ ఇస్తాం
నెల్లూరు(పొగతోట): లబ్ధిదారులు ఏదైనా కారణంతో ఒక నెలలో పెన్షన్ తీసుకోకుంటే తర్వాతి నెలలో రెండు నెలలకు సంబంధించిన నగదు ఇస్తామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుసగా రెండు నెలలు తీసుకోకుండా ఉంటే ఆ తర్వాతి నెలలో మూడు నెలల నగదు ఒకేసారి అందజేస్తామని తెలియజేశారు. అయితే మూడునెలలు వరుసగా తీసుకోకుండా ఉండే లబ్ధిదారులను మాత్రం నిలిపి వేస్తామన్నారు. వారు మళ్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే పూర్తిస్థాయిలో పరిశీలించి మంజూరు చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment