No Headline
ఉదయగిరి: కూటమి ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో చిత్తశుద్ధి లోపించింది. మూడు దఫాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల అంశంగా మార్చుకోవడం బాబు నైజంగా మారింది. కొన్నేళ్ల క్రితం దీనికి చంద్రబాబు శంకుస్థాపన చేసి ఆ తర్వాత పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పనులు శరవేగంగా జరిగాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండు సొరంగాలతోపాటు, బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేశారు. ఆయన మళ్లీ సీఎం అయ్యుంటే ఈ రబీ సీజన్ నుంచి ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాల్లో కృష్ణమ్మ జలాలు పారేవి. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి బీడు పొలాలకు నీరివ్వకుండా గత ప్రభుత్వంలో పనులు జరగలేదంటూ తప్పుడు ప్రచారం చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
ఖర్చు చేసి..
నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.8043.8 కోట్లకు పాలనా ఆమోదం తీసుకుని రూ.3,610.38 కోట్లు ఖర్చు చేసి 20.333 కి.మీ (మొత్తం పొడవు 37.587 కి.మీ) జంట సొరంగాలు పనులు జరిగాయి. ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా ఉన్న నల్లమలసాగర్ పనులు పూర్తి చేశారు.
కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన బాబు
చంద్రబాబు పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైంది. శంకుస్థాపన చేసిన బాబు సర్వే పేరుతో కాలయాపన చేశారే తప్ప పైసా కూడా కేటాయించలేదు. 2014 – 19 మధ్య ప్రకాశం జిల్లా పర్యటనకు ఐదుసార్లు వచ్చారు. ప్రతిసారీ త్వరలో పూర్తి చేస్తామని మభ్యపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన బాబు త్వరలో పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మాట తప్పారు. 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.1,385.81 కోట్లు ఖర్చు చేసి అందులో రూ.630 కోట్లను అప్పనంగా తమ అనుకూల కాంట్రాక్టర్లకు దోచి పెట్టినట్లు కాగ్ తప్పు పట్టింది. చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌కు నామినేషన్ విధానంలో పనులు అప్పగించి రూ.వందల కోట్లు దోచి పెట్టారని నాడు విమర్శలు వచ్చాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగం పుంజుకున్నాయి. జంట సొరంగాలు, బ్యాక్‌వాటర్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేశారు.
కొత్త డ్రామా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవడం లేదు. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు మరో మంత్రి రవికుమార్‌తో కలిసి అక్కడికి వెళ్లి గత ప్రభుత్వంలో పనులు ఏమీ జరగనట్లు అసత్య ప్రచారం చేశారు. పూర్తి చేసి తామే సాగునీరు ఇస్తామని నిమ్మల చెప్పారు. అయితే బడ్జెట్‌లో కేవలం రూ.394 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కనీసం రూ.4 వేల కోట్లు అవసరమని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్ట్ వివరాలు
నీటి నిల్వ సామర్థ్యం : 45 టీఎంసీలు
లబ్ధి చేకూరే జిల్లాలు :
వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం
ఆయకట్టు : 5 లక్షల ఎకరాలు
తాగునీరు : 15 లక్షల మందికి..
బడ్జెట్‌లో
నామమాత్రంగా నిధులు
2014–19 మధ్య పనులు గాలికి...
వైఎస్సార్ హయాంలోనే వేగవంతంగా నిర్మాణం
జగన్ హయాంలో సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్ పనుల పూర్తి
వెలిగొండకు దశాబ్దాలుగా గ్రహణం పట్టింది. ప్రజలకు ఉపయోగపడే ఈ పనులు చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యం వహిస్తుంటారు. వేరే వాళ్లు చేసిన పనులను మాత్రం తన క్రెడిట్‌గా చెప్పుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడరు. సాగునీటి ప్రాజెక్ట్‌లను బాబు ఏనాడూ పట్టించుకోలేదు. కానీ రైతులపై మాత్రం ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment