No Headline
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా తగ్గేదే లేదన్నట్లు పెరుగుతున్నాయి. ఆరు నెలలకుపైగా ఏ వస్తువు ధర కూడా తగ్గిన పరిణామమే లేదు. సగటు కుటుంబాలపై ఆర్థిక భారం పడి విలవిలలాడుతున్నాయి. ధరలు నియంత్రించాల్సిన పాలకులు ఆ పనికి స్వస్తి పలికారు. ప్రతిపక్షం అణచివేతపై దృష్టి సారించారే తప్ప.. ప్రజా శ్రేయస్సుపై మనస్సు పెట్టిన పాపాన పోలేదు. అధికార యంత్రాంగం కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
●
● ఆరు నెలలుగా ౖపైపెకి
దూసుకెళ్తున్న ధరలు
● పప్పులు, నూనెలతోపాటు కూరగాయలు
● సగటు కుటుంబాలపై ఆర్థిక భారం
● అందుబాటు ధరలకు తగ్గించడంలో అధికారులు, పాలకుల వైఫల్యం
● నూనెల ధరలు పెంచిన ఫ్యాక్టరీలపై చర్యలు శూన్యం
● తగ్గించాలంటూ వ్యాపారులపై ఒత్తిడి
●
పప్పులు/నూనెలు వైఎస్సార్‌సీపీ పాలనలో కూటమి పాలనలో
కందిపప్పు రూ.150 – రూ.165 రూ.190 – రూ.210
వేరుశనగ నూనె రూ.140 – రూ.155 రూ.170 – రూ.190
పామాయిల్ రూ.90 – రూ.98 రూ.120 – రూ.135
సన్‌ఫ్లవర్ రూ.100 – రూ.113 రూ.140 – రూ.150
రైస్‌బ్రాన్ రూ.125 – రూ.130 రూ.140 – రూ.150
నెల్లూరు (పొగతోట): జిల్లాలో పప్పులు, ఉప్పులు, నూనెల నుంచి కూరగాయల వరకు ధరలు భగ్గుమంటున్నాయి. ఏ వస్తువు పట్టుకున్నా.. ఏ కూరగాయ తీసుకున్నా.. ధరలు షాక్ కొట్టే రీతిలో ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్కెట్‌లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే.. వెంటనే అప్పటి ప్రభుత్వం స్పందించి రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరలకే అందిస్తూ మార్కెట్లో వ్యాపారుల దోపిడీకి కళ్లెం వేస్తూ వచ్చింది. ఆ ప్రభుత్వ హయాంలో వరుస పెట్టి కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని కొద్దిపాటి ధరలు పెరిగితే ఇదే కూటమి నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరలు రెండింతలు పెరిగిపోయినా.. నియంత్రణకు ఏ విధంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూటమి అధికారంలోకి వస్తే నిత్యావసరాల ధరలు తగ్గిస్తామంటూ ప్రజలకు మాయమాటలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు ఆకాశాన్నంటుతున్నా.. ‘దున్నపోతు మీద వాన పడుతున్నా.. చలించని’ చందంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో దాదాపు 30 లక్షల మంది ప్రజల జీవనంపై ధరల ప్రభావం పడుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రం, జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్నాయి.
పరిశ్రమల్లోనే నూనెల ధరలు అధికం
నూనెల ధరలు అయితే పరిశ్రమలే పెంచాయి. అక్కడే ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అది తమ చేతుల్లో లేదంటూ వ్యాపారులపై తగ్గించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రయత్నానికి తిలోదకాలు ఇచ్చారు. అధికారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యాపారులపై తక్కువ ధరలకు విక్రయించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. పరిశ్రమల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ వ్యాపారులకు రూ.137లకు (ప్రతి రోజూ వ్యత్యాసం ఉంటుంది) రవాణా చార్జీలు అన్నీ కలుపుకుని అందుబాటులోకి వస్తుంది. వ్యాపారులు రూ.140 నుంచి రూ.150కు విక్రయిస్తున్నారు. పామాయిల్ రూ.120 పడుతోంది.
రైతుబజార్‌లో సబ్సిడీకి సరఫరా చేయాలి
అయితే రైతుబజార్‌లో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ ధరకు నిత్యావసరాలు విక్రయించాలని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.124కు, పామాయిల్ రూ.104కు, కందిపప్పు రూ.150కు విక్రయించాలంటూ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులపై అధికారులు ఒత్తిడి చేయడంతో నష్టానికి అమ్మలేమంటూ వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. ఇలా చేస్తే లీటర్‌కు నూనెలపై రూ.15 నుంచి రూ.20, కందిపప్పుపై రూ.30 నుంచి రూ.40 నష్ట పోతున్నామంటున్నారు. నూనెల పరిశ్రమలు, పప్పు మిల్స్ యాజమాన్యాలు ధరలు తగ్గించి విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే సాధ్యమవుతుందంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పలేక అటు అధికారుల ఆదేశాలను పాటించలేక హోల్‌సేల్ వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నాం
నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి తక్కువ ధరలకే కందిపప్పు, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇందు కోసం హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో చర్చిస్తున్నాం. పరిశ్రమల్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– వెంకటరమణ, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment