ధరల నియంత్రణకు చర్యలు
● జేసీ కె.కార్తీక్
నెల్లూరు రూరల్: మార్కెట్లో నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలని, సంబంధిత శాఖల అధికారులు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ చెప్పారు. ధరలకు కళ్లెం వేసేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కేంద్రాలు, రైతుబజార్లలో పామాయిల్ లీటర్ రూ.110కే వినియోగదారులకు అందించాలన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే అందిస్తున్నామన్నారు. పారదర్శకత కోసం ఈ ధరలను సూచించే బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు నిత్యావసరాలు అమ్మకపొతే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో హోల్‌సేల్ షాపుల్లోని నిల్వలను నమోదు చేయాలన్నారు. ధరల నియంత్రణ కమిటీ సమావేశం తరచూ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం కొత్తగా సెల్ ఏర్పాటు చేసామని, ప్రతి రోజూ ఒక హోల్‌సేల్, ముగ్గురు రిటైల్ వ్యాపారస్తుల నుంచి ధరల వివరాలు సేకరించి నివేదిక పంపాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ వెంకటరమణ, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, పౌరసరఫరాల డీఎం నరసింహారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుబ్బారెడ్డి, వివిధ ఆయిల్ కంపెనీల వ్యాపారస్తులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment