జిల్లాపై ఫ్లూ పంజా
● జలుబు, దగ్గు, జ్వరం,
ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న రోగులు
● నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాకు
దారితీసే అవకాశం
● చలికాలంలో పెరుగుతున్న కేసులు
నెల్లూరు ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్ నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ముక్కునుంచి నీరు లాగా కారడం, గొంతు నొప్పి, కండరాలనొప్పి, తలనొప్పి, దగ్గు, నీరసం, చలి వంటి లక్షణాలతో స్థానిక శంకరాగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లాడు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు మలేరియా, డెంగీతో పాటు, టైఫాయిడ్ లాంటి రక్తపరీక్షలు చేశారు. అన్నీ నార్మల్‌గా వచ్చాయి. చివరకు శీతాకాలంలో వచ్చే ఫ్లూ జ్వరంగా నిర్థారించారు. రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని సైలెన్లు పెట్టి నీరసం తగ్గించారు. జిల్లాలో అనేక మంది ఇదే విధంగా బాధపడుతున్నారు.
– నెల్లూరు(అర్బన్)
● వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా ఫ్లూ సులభంగా అంటుకుంటుంది. అలాగే ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు, బ్రాంకై టిస్, హార్ట్‌ఫెయిల్యూర్, కరొనరీ ఆర్టరీ డిసీజ్ బాధితులు, కిడ్నీ, లివర్ సమస్యలున్న వారు ఫ్లూతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ.
● వర్షాకాలంతో పాటు శీతాకాలం ఫ్లూ జ్వరాలకు అనుకూలం. హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా అనే వైరస్ వల్ల వ్యాప్తిచెందుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, అలసట లాంటి లక్షణాలు ఉంటాయి.
● ఫ్లూ జబ్బు అనేది తుమ్మినా, దగ్గినా వాటి రేణువులు పక్కవారి మీద పడటంతో సులభతరంగా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ వైరస్ విజృంభిస్తోందని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
● ఐఎంఏ అంచనాల ప్రకారం జిల్లాలో 10 శాతం మంది రోగులు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారు. అంటే సుమారు 2.70 లక్షల మంది ఫ్లూ జ్వరపీడితులే. ఎక్కువ మందికి మూడు, నుంచి నాలుగు రోజుల్లో తగ్గిపోతుండటం కొంతవరకు ఊరటనిస్తోంది.
పరీక్ష ఎలాగంటే..
ముక్కు, గొంతు స్వాబ్‌తో పరీక్ష చేయించుకోవడం ద్వారా కరోనా, ఇన్‌ఫ్లూయెంజా వైరల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నాయో లేదో నిర్ధారణ చేయవచ్చు. తీవ్రత తక్కువగా ఉంటే ఇంటి వద్దనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడవచ్చు. విపరీతమైన దగ్గు, ఆయాసం ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. ఫ్లూ జబ్బులకు యాంటీబయాటిక్స్ మందులు పెద్దగా పని చేయవు. యాంటి వైరల్ మందులు మాత్రల రూపంలో గాని, ద్రవరూపంలో గాని వాడాలి.
● జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రితో పాటు నెల్లూరులో బోధనాస్పత్రి ఉన్నాయి. వీటిల్లో జ్వరపీడితులే ఎక్కువగా ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో కూడా ఇదే పరిస్థితి.
●
ఇలా వ్యాపిస్తుంది
Comments
Please login to add a commentAdd a comment