నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

Published Sat, Nov 23 2024 12:29 AM | Last Updated on Sat, Nov 23 2024 12:29 AM

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు సీఈఓ విద్యారమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి సమీక్షించనున్నారు. సమావేశానికి జెడ్పీ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తాం

కలెక్టర్‌ ఆనంద్‌

కొడవలూరు: జిల్లాలో గిరిజనులంతా ప్రధానంగా ఆధార్‌, ఇంటి వసతి, జాబ్‌కార్డులు లేకపోవడం వంటి మూడు సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ స్పష్టం చేశారు. మండలంలోని నార్తురాజుపాళెం వినాయకనగర్‌ గిరిజన కాలనీని శుక్రవారం ఆయన సందర్శించి కనీస వసతులకు దూరంగా జీవిస్తున్న తీరును పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తాగునీటి వసతి లేక కాలువ నీటినే వాడుతున్నామని కలెక్టర్‌కు తెలిపారు. తీవ్రమైన ఈ సమస్యపై స్పందించిన కలెక్టర్‌ నీళ్ల ట్యాంక్‌ సదుపాయం కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఇంటి వసతి విషయమై కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌ను పిలిచి గిరిజనుల ఇంటి నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక స్వాగత్‌ ఫంక్షన్‌ హాల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. గిరిజనులందరికీ ఆధార్‌ కార్డుల సదుపాయం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ఆరంభించామన్నారు. ఇంటి సమస్యలతోపాటు జాబ్‌ కార్డులు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. నీటి, డ్రెయినేజీ, కరెంట్‌ వసతులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏఆర్డీ సంస్థ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఐటీడీఏ పీఓ పరిమళ, హౌసింగ్‌ డీఈ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ కె.స్ఫూర్తి, ఎంపీడీఓ ఏవీ సుబ్బారావు, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్‌ బి.సుప్రియ, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

హోమ్‌గార్డ్స్‌ డీఎస్పీ బదిలీ

నెల్లూరు(క్రైమ్‌): రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది ఏఆర్‌ డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీిపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నెల్లూరు హోమ్‌గార్డ్‌ డీఎస్పీగా పనిచేస్తున్న కె.సుంకరయ్య అక్టోపస్‌కు బదిలీ కాగా, అక్కడ విధుల్లో ఉన్న ఎన్‌వీ రమణ నెల్లూరు హోమ్‌గార్డు డీఎస్పీగా నియమితులయ్యారు.

ఆర్‌ఐకు పదోన్నతి

నెల్లూరులో ఉన్న ఆర్‌ఐ కె.థామస్‌రెడ్డి డీఎస్పీగా పదోన్నతి పొంది పార్వతీపురం మన్యం ఏఆర్‌ డీఎస్పీగా నియమితులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement