స్వేచ్ఛను హరించే పాలన
ఏ ఒక్కరినీ విడిచిపెట్టం
● మోసాలు, వైఫల్యాలను నిలదీస్తే
అక్రమ కేసులు
● భావ ప్రకటన స్వేచ్ఛను హరించే
హక్కు ఎవరికీ లేదు
● పార్టీ శ్రేణులను ఇబ్బందిపెట్టిన
ఏ ఒక్కరినీ విడిచిపెట్టం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై
అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన వారిపై కేసులు నమోదుచేయాలి
నెల్లూరు (క్రైమ్): రాజ్యాంగం ప్రజలకు కల్పించిన స్వేచ్ఛను హరించేలా చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కిశోర్‌కుమార్‌కు శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్‌కు అందజేశారు. అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేయలేదని, ప్రజలను మభ్య పెడుతున్నారని ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. తనపైనే మూడు కేసులు పెట్టారన్నారు. సోషల్ మీడియాతో ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు. ఎమర్జెన్సీ రోజులు, బ్రిటిష్ పాలనలో ఇలాంటి నిర్బంధాలు, దారుణాలు చూడలేదన్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు.
ఆవేదన.. ఆవేశంగా మారితే..
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉన్న ఆవేదన ఆవేశంగా మారి రోడ్డెక్కడం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం, పోలీసులు, అధికారులు తట్టుకోలేరని కాకాణి హెచ్చరించారు. కూటమి నేతల దాష్టీకాలు పెరిగితే... భవిష్యత్‌లో శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, చంద్రబాబు మోసాలపై ప్రజలు కసితో రగిలిపోతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసిందని, పాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇది పాలకులకు కంటగింపుగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే ప్రజాసమస్యల మీద, సంక్షేమ కార్యక్రమాలపై గళం విప్పేవారన్నారు. అయితే కూటమి ఎమ్మెల్యేలు ఆ పని వదిలేసి, మాజీ ఎమ్మెల్యేలపై మీద ఫిర్యాదులు ఎత్తుకుని విచారణ జరపాలని అధికారులను ఆదేశిస్తున్నారన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో కక్ష సాధింపు చర్యలకు, అణిచివేత ధోరణికి పాల్పడి ఉంటే ఈ రోజు నేటి ప్రజాప్రతినిధులకు కనీసం పోటీ చేసే శక్తి, సామర్థ్యాలు కూడా ఉండేవి కావన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరురూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజు మనది కాకపోవచ్చు, అధికారంలో లేకపోవచ్చు, దాడులు జరగొచ్చు, కేసులు పెట్టొచ్చు, జైళ్లకు పంపొచ్చు.. ఎవరూ అధైర్యపడొద్దు, లోకేశ్ మాదిరిగా మాకు రెడ్‌బుక్ అవసరం లేదు. మీపై అనుచితంగా ప్రవర్తిస్తున్న, పోస్టులు పెడుతున్న వారి పేర్లను నమోదు చేసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ విడిచి పెట్టమని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు భరోసానిచ్చారు. అధికారం ఏ ఒక్కరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని టీడీపీ నేతలు, వారితో అంటకాగుతున్న అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కేసులకు, అరెస్ట్‌లకు, జైళ్లకు బయపడేవారు ఎవరూ లేరన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సప్తసముద్రాల అవతల ఉన్నా పట్టి తెచ్చిశిక్షిస్తామని హెచ్చరించారు. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా మసులుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment