నెల్లూరు (టౌన్): వారంతా న్యాయ విద్యార్థులు. భవిష్యత్తులో అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించి సమాజంలో పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన వారు ఘర్షణకు దిగారు. కళాశాలలో ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు రెండు వర్గాలుగా చీలిపోయారు. లేని దానికి ఉన్న దానికి ఘర్షణ పడుతూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం వీఆర్ న్యాయ కళాశాలలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీనికి తోడు ఓ వర్గం వారు బయట నుంచి వ్యక్తులను పిలిపించి మమ్మల్ని కొట్టించినట్లు మరో వర్గం ఆరోపిస్తోంది. వీఆర్ న్యాయ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు చివరి రోజు కావడంతో చేరేందుకు వచ్చిన వారితో పాటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నారు. వారి ముందు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు మాట మాట పెరిగి ఇరు వర్గాలకు చెందిన వారు కళాశాలలోనే ఘర్షణకు దిగారు. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఫోన్ నంబరు ఇవ్వాలంటూ మరో వర్గానికి చెందిన నాయకుడు వేధించడంతోనే ఘర్షణ ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
వీఆర్ న్యాయ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియకు తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు న్యాయ కోర్సులో చేరేందుకు వచ్చారు. లా ఎంట్రెన్స్ టెస్ట్ రాయకపోయినా స్పాట్ అడ్మిషన్ కింద సంబంధిత ఫీజు చెల్లిస్తే వెంటనే ప్రవేశం ఇస్తారు. అయితే కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ సంఘాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు ఉంది. గతంలో ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. అడ్మిషన్లు జరుగుతుండటంతో అడ్మిషనుకు వచ్చిన విద్యార్థులను తమ వర్గంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ వారి ఆధిపత్య పోరుపై కళాశాల ప్రిన్సిపాల్ గాని, అధికారులు గాని దృష్టి సారించలేదు. గురువారం జరిగిన ఘర్షణలో విద్యార్థులతో పాటు విద్యార్ధినులు సైతం తలపడ్డారు. ఓ వర్గం వారు తీసుకువచ్చిన తమిళనాడుకు చెందిన వ్యక్తులు మాపై దాడికి పాల్పడ్డారని మరో వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇరువర్గాల ఫిర్యాదు
కళాశాలలో ఘర్షణకు దిగిన ఇరువర్గాలకు చెందిన వారు 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు వీరిపై ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. సీఐ, ఎస్సైలు వీఆర్ న్యాయ కళాశాలకు శుక్రవారం వచ్చి ఏం జరిగిందన్న దానిపై ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. విద్యార్ధులందరినీ సమావేశ పరిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఘర్షణలకు దిగితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని, కేసులు ఉన్నట్లయితే మీ జీవితాలు నాశనమవుతాయని హితబోధ చేశారు. అయితే ఘర్షణపై విచారించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఘర్షణ జరిగింది వాస్తవమే:
శ్రీధర్, ప్రిన్సిపాల్
వీఆర్ న్యాయ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. అయితే ఈ ఘర్షణ ఎందుకు జరిగిందో నాకు తెలియదు. విద్యార్థులు కళాశాల బయట ఘర్షణ పడ్డారు. పోలీసులు కళాశాలకు వచ్చి ఘర్షణపై ఆరా తీశారు. ప్రస్తుతం కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ జరుగుతోంది.
కళాశాలలోనే డిష్యుం.. డిష్యుం
పోలీసు స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment