మోసాలను వివరించి.. చర్యలు కోరి..
● ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● ఫిర్యాదులు స్వీకరించిన ఏఎస్పీ సౌజన్య
నెల్లూరు(క్రైమ్): నాకు తెలియకుండా బ్యాంక్ లోన్ తీసుకున్నారని ఒకరు.. ప్రేమపేరిట వంచించారని మరొకరు.. నా పేరుపై లోన్ తీసుకుని కట్టలేదని ఇంకొకరు.. ఇలా పలువురు తమకు జరిగిన మోసాలను ఏఎీస్పీ సీహెచ్ సౌజన్య దృష్టికి తీసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 97 మంది తమ సమస్యలపై ఏఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. చట్టపరిఽధిలో సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాకు తెలియకుండా..
మనోహర్ అనే వ్యక్తి నా పేరుపై ఎస్టీ కార్పొరేషన్‌లో సబ్సిడీ లోన్ తీసుకున్నాడు. నగదు చెల్లించకపోవడంతో నాకు నోటీసులు వచ్చాయి. దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని అల్లూరుకు చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు.
ప్రేమ పేరిట వంచన
కలువాయి మండలానికి చెందిన సికిందర్ నన్ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం దగ్గరయ్యాం. ప్రస్తుతం నేను గర్భవతిని. పెళ్లి చేసుకోవాలని సికిందర్‌ను అడిగితే నిరాకరించడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నాడని సైదాపురానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
లోన్ తీసుకుని..
హైదరాబాద్‌కు చెందిన మహేష్ మరో ఇద్దరు కలిసి ప్రముఖ బ్యాంకులో నా పేరుపై ఖాతాను తెరిచారు. రూ.5 లక్షలు లోన్ తీసుకుని కట్టలేదు. నన్ను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
వేధిస్తున్నాడు
కావలికి చెందిన ఓ వ్యక్తి కోర్కె తీర్చాలని, లేనిపక్షంలో ఉద్యోగపరంగా ఇబ్బంది పెడతానంటూ వేధిస్తున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని దగదర్తి మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
కుమార్తె ఆచూకీ కోసం..
నా కుమార్తె నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. నెలరోజుల క్రితం కళాశాలకు వెళ్లి అదృశ్యమైంది. ఆమె కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. విచారించి ఆమె ఆచూకీ తెలియజేయాలని వెంకటాచలసత్రానికి చెందిన ఓ మహిళ అభ్యర్థించారు.
కాపురాన్ని చక్కదిద్దండి
12 ఏళ్ల క్రితం బుజబుజనెల్లూరుకు చెందిన ఓ వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నాను. కొంతకాలం మా కాపురం సజావుగా సాగింది. ప్రస్తుతం నా భర్త నన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని చక్కదిద్దండి.
Comments
Please login to add a commentAdd a comment