రెడ్‌బుక్ పేరుతో రాక్షస పాలన
నెల్లూరు(బారకాసు): రాష్ట్రంలో రెడ్‌బుక్ పేరుతో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. టీడీపీ నేతల చేతిలో గాయ పడి నెల్లూరు నగరంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ముత్తుకూరు బిట్–2 ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లును సోమవారం పలువురు నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి నిత్యం దాడులు, దండయాత్రలతో ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేవలం పార్టీ మారలేదన్న కక్షతో వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడ్డారన్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులు వెంకటేశ్వర్లు కాలు తుంటెకు శస్త్రచికిత్స చేయాలని చెబుతున్నారన్నారు. ఇంత జరిగినా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయలేదన్నారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని.. ఈరోజు మీరు చేస్తున్న పాపాలు శాపాలుగా మారి భవిష్యత్తులో వెంటాడుతూనే ఉంటాయన్నారు. ఎంపీటీసీ వెంకటేశ్వర్లు మీద జరిగిన దాడిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే తాము ప్రైవేట్ కేసు వేస్తామన్నారు. ఈకార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాధారణ పౌరులకు భద్రత కరువైంది
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment