తహసీల్దార్ వచ్చినా... సిబ్బంది రారే..!?
కావలి: కావలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వచ్చినా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 10.20 గంటలకు తహసీల్దార్ పి.శ్రావణ్‌కుమార్ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా తన సీటులో కూర్చొని, అప్పటికే తన టేబుల్‌పై ఉన్న వివిధ పైళ్లను పరిశీలించి వాటిపై సంతకాలు చేశారు. తన వద్దకు వచ్చిన అర్జీదారులను ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చొమని చెబుతూ ఫైళ్లు చూస్తూ సంతకాలు పెడుతున్నారు. సరిగ్గా 11 గంటలకు ఆ పని ముగియడంతో అర్జీదారులతో మాట్లాడటం, వారు చెప్పిన సమస్యలు వినడం ప్రారంభించారు. కాగా 10.45 గంటల తర్వాత కార్యాలయ సిబ్బంది ఒక్కొక్కరు విధులకు రాగాసాగారు.
మాజీ సైనికుడికి తప్పని కబ్జాదారుల కష్టాలు
కావలి పట్టణంలోని శాంతినగర్‌లో దాసరి ఆదినారాయణ అనే సైనికుడు 30 ఏళ్ల కిత్రం 25 సెంట్ల భూమి కొనుగోలు చేశాడు. సైనికుడిగా రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. ఆదినారాయణకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఆ చుట్టు పక్కల వ్యక్తులు స్వాధీనం చేసుకొని నివాసాలను నిర్మించుకున్నారు. దీంతో దాసరి ఆదినారాయణ దంపతులు సోమవారం కావలికి చేరుకుని తహసీల్దార్ పి.శ్రావణ్‌కుమార్‌ను కలిసి తమ గోడును చెప్పుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కబ్జాదారులు ఇలాంటి శిక్ష వేయడమేమిటని తహసీల్దార్‌కు దీనంగా చెప్పుకున్నారు. పరిశీలించి తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను తీసుకుంటానని మాజీ సైనికుడు దంపతులకు తహసీల్దార్ చెప్పారు.
ఇంటి స్థలం కోసం
కార్యాలయానికి వచ్చిన గోళ్ల రమణమ్మ వద్ద ఇంటి పట్టా ఉంది. దానిపై అక్షరాలు కనిపించడం లేదు. అది 30 ఏళ్ల క్రితం నాటి తహసీల్దార్ జారీ చేసిన పట్టాలా అనిపిస్తోంది. పట్టా పట్టుకుని ఆమె తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంది. చాలా ఏళ్ల క్రితం పట్టా ఇచ్చారు. ఆ స్థలం చూపించమని తిరుగుతున్నా.. పరిష్కారం కాలేదని బయట దీనంగా కూర్చొని వచ్చిపోయే వారికి చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment