రికార్డు స్థాయిలో వినతులు
● కలెక్టరేట్‌కు పోటెత్తిన జనం
● ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో
405 అర్జీల అందజేత
● మండలాల్లో పరిష్కారం
కాకపోవడంతోనే..
● రెవెన్యూ సమస్యలే అధికం
నెల్లూరు రూరల్: మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మొక్కుబడిగా జరుగుతోంది. నెల్లూరులోని కలెక్టరేట్‌లో జరుగుతున్న కార్యక్రమానికి అందుతున్న వినతుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఈ సోమవారం కూడా జనం పోటెత్తారు. తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రికార్డు స్థాయిలో 405 అర్జీలు వచ్చాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 163 అర్జీలందాయి. పోలీస్ శాఖవి 73, మున్సిపల్ శాఖవి 50, సర్వేవి 18, పంచాయతీరాజ్ శాఖవి 31, సివిల్ సప్లయీస్‌కు సంబంధించి 7 అర్జీలు తదితరాలున్నాయి.
అధికారుల నియామకం
కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన అర్జీల పరిష్కారాన్ని ఆడిట్ చేయడానికి 19 మంది జిల్లా అధికారులను నియమించామన్నారు. ఆడిట్ చేసిన వాటిలో కొన్నింటిని తన పరిశీలనకు పంపాలని ఆదేశించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవానీ, డీఎంహెచ్‌ఓ సుజాత, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గంగాధర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment