నెల్లూరు(క్రైమ్): ఉమ్రా యాత్రకు పంపుతామని పలువురు ముస్లింల నుంచి నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ట్రావెల్స్ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా తాజాగా సోమవారం పెద్ద ఎత్తున ముస్లింలు ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. చైన్నెకు చెందిన నాజ్ ఉమ్రా సర్వీసెస్ నిర్వాహకుడు జాఫర్, అతడి పీఏ సలాం పలు జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా తక్కువ (ఒక్కో మనిషికి రూ.55 వేల నుంచి రూ.60 వేలు)ఖర్చుతో ఉమ్రా యాత్రకు పంపుతామని ప్రకటనలిచ్చారు. కొందరిని యాత్రకు పంపి నమ్మకం సంపాదించుకున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో చాలామంది మస్లింలు సదరు సంస్థకు డబ్బు చెల్లించి పాస్‌పోర్టులను సైతం అప్పగించారు. ఈనెలలో వారు ఉమ్రా యాత్రకు వెళ్లాల్సి ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోసాగారు. ఈనెల మొదట్లోనే సంస్థ కార్యాలయాన్ని మూసివేసి నిర్వాహకులు ఎటో వెళ్లిపోయారు. వారి ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. పలువురు బాధితులు చైన్నెకి వెళ్లి వారికోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. సంస్థ మోసంపై వెంగళరావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ ఖాదర్ షరీఫ్ ఫిర్యాదు మేరకు ఈనెల 17వ తేదీన వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి ప్రత్యేక బృందాన్ని చైన్నెకు పంపారు. విచారణలో మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ
సంస్థ మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలోని వెంగళరావ్‌నగర్, మహాత్మా గాంధీనగర్, ప్రశాంతినగర్ తదితర ప్రాంతాలకు బాధితులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
27 మంది నుంచి..
నెల్లూరు నగరానికి చెందిన అనీస్ ట్రావెల్స్ సంస్థ ఏజెంట్. అతను నెల్లూరు నగరంలో 27 మందిని ఉమ్రా యాత్రకు పంపుతానని ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.55 వేలు చొప్పున రూ.14.85 లక్షలు వసూలు చేసి వాళ్ల పాస్‌పోర్టులు తీసుకున్నాడు. ఈనెల మొదటి వారంలో వారిని యాత్రకు పంపాల్సి ఉండగా ఏజెంట్ కాలయాపన చేయసాగాడు. ఇటీవల గట్టిగా నిలదీయడంతో సరైన సమాధానం చెప్పలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు విచారిస్తున్నారు. మొత్తంగా ట్రావెల్స్ సంస్థ బాధితులు సుమారు 200 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment