అప్పుడు భయపెట్టి.. ఇప్పుడు జై కొట్టి..
● కోవూరుపల్లిలో
భూముల రీ సర్వే ప్రారంభం
● ఆర్భాటంగా టీడీపీ నేతల
ప్రచార ర్యాలీ
బిట్రగుంట: బోగోలు మండలం కోవూరుపల్లిలో భూముల రీ సర్వే ప్రక్రియను పైలట్ ప్రాజెక్ట్‌గా సోమవారం పునః ప్రారంభించారు. నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించిన భూముల రీ సర్వే ప్రక్రియపై విష ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా రద్దు చేస్తామని, పాత పద్ధతినే కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ఊదరగొట్టారు. బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా భూముల రీ సర్వేపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విష ప్రచారం నిర్వహించారు. అయితే అధికారం దక్కాక కూటమి ప్రభుత్వం తాజాగా పైలట్ ప్రాజెక్ట్ పేరుతో భూముల రీ సర్వే చేపట్టడం గమనార్హం. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్’ పేరుతో భూముల రీ సర్వేకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జనాలు అవాక్కవుతున్నారు. గతంలో జరిగిన రీ సర్వేను రద్దు చేయకుండా, తప్పులు సవరించకుండా కొత్తగా రీసర్వే చేపట్టడంపై ప్రజలతోపాటు అధికారుల్లోనూ కూడా గందరగోళం నెలకొంది. గతంలో జరిగిన రీ సర్వేలో దొర్లిన తప్పులు సవరిస్తామని ఇప్పటికే రెండుసార్లు గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించినా.. ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అంతలోనే మళ్లీ రీ సర్వే పునః ప్రారంభించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోమవారం కోవూరుపల్లిలో రీ సర్వే ప్రారంభిస్తూ అధికారులతోపాటు టీడీపీ నాయకులు ఆర్భాటంగా ర్యాలీ, గ్రామసభ నిర్వహించారు. ఎన్నికలకు ముందు తీవ్రంగా విమర్శించిన టీడీపీ నాయకులు ఇప్పుడు రీ సర్వేకు జై కొడుతూ ర్యాలీలు నిర్వహించడంపై జనం విస్తుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment