ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
నెల్లూరు (పొగతోట): నిధులు దుర్వినియోగం చేసిన విషయంలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశాల మేరకు డీపీఓ శ్రీధర్‌రెడ్డి సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెం పంచాయతీ కార్యదర్శి పి.శ్రీకాంత్, గతంలో పనిచేసిన కార్యదర్శి మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. లక్షల రూపాయల పంచాయతీ నిధుల దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. బిల్లులు లేకుండా నిధులు ఖర్చు చేసినట్లు నిర్థారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
ఇద్దరు సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు
కొడవలూరు మండలం రేగడిచెలిక పంచాయతీ నిధుల ఖర్చుల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేయడం, చెల్లింపులు తదితర ఆరోపణలపై సర్పంచ్ శ్రీనివాసులు చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తూ డీపీఓ శ్రీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ నిధుల నుంచి రూ.10,08,104 నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేయడం, చెల్లింపులు చేయడంతో చెక్ పవర్‌ను రద్దు చేశారు. అదే మండలం పెమ్మారెడ్డిపాళెం సర్పంచ్ నవీన్ చెక్‌పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తూ డీపీఓ శ్రీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేయడం, చెల్లింపులు విషయంపై ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై వివరణ కోరుతూ షోకాజు నోటీసులు జారీ చేశారు. అయితే సర్పంచ్ నుంచి ఎటువంటి సంజాయిషీ రాకపోవడంతో చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.
ట్రాక్‌మెన్ల యుద్ధభేరి
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్‌మెన్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిట్రగుంటలో సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ‘యుద్ధభేరి’ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూ కార్యాలయం ఎదుట ట్రాక్‌మెన్‌లు నిరసన ప్రదర్శన నిర్వహించి తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ కీమెన్‌ల పనిభారం తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. నైట్ పెట్రోలింగ్‌లో ఇద్దరు కీమెన్‌లను కేటాయించాలని, మహిళా ట్రాక్‌మెన్లను వేరే విభాగాలకు బదిలీ చేయాలని కోరారు. నైట్ పెట్రోలింగ్ మెన్ బీట్ పరిధిని 10 కి.మీ. లోపు కుదించాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బిట్రగుంట బ్రాంచ్ చైర్మన్ మద్దిబోయిన వెంకటశేఖర్, కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు మధు, నరసయ్య, మైఖేల్, శైలేష్, రఘు, మహేంద్ర, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
నగర డీఎస్పీ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్) : నెల్లూరు నగర నూతన డీఎస్పీ గా పెసర సింధుప్రియ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తొలుత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని సబ్‌డివిజన్ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు సిబ్బంది స్వాగతం పలికా రు. చిన్నబజారు, నవాబుపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీనగర్, సౌత్, నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌లు చిట్టెం కోటేశ్వరరావు, అన్వర్‌బాషా, రోశయ్య, శ్రీనివాసులురెడ్డి, సాంబశివరావు, వెంకటరెడ్డి, రామకృష్ణలు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తాము తీసుకోనున్న చర్యలకు సహకరించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్పీ జి.కృష్ణకాంత్, ఏఎస్పీ సుప్రజలను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment