హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట కొనుగోలు, అమ్మకందారుల సందడి
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వసతులు పెరిగి శివారు ప్రాంతాలూ అభివృద్ధి చెందాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోగా స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఫలితంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. ఇటీవలే ప్రభుత్వం కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (కార్డ్) సాఫ్ట్‌వేర్‌ను మరింత ఆధునీకరించి కార్డ్ ప్రైమ్ 2.0కు రూపకల్పన చేసింది. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చక చకా జరిగిపోతున్నాయి. తద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటోంది.
ప్రభుత్వానికి రూ.116.68 కోట్లు..
జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి నవంబరు 30వ తేదీ నాటికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు నిర్దేశించిన లక్ష్యంలో సగటున 77.20 శాతం మేర వసూలు అయింది. తనకల్లు, మడకశిర, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, పెనుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నుంచి లక్ష్యానికి మించి ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. హిందూపురం, కదిరి, ధర్మవరం, బుక్కపట్నం కార్యాలయాలు లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (బుక్కపట్నం, చిలమత్తూరు, సీకే పల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు) ఉన్నాయి. 2023 ఏప్రిల్ నుంచి 2023 నవంబరు 30 నాటికి మొత్తం రూ.151.15 కోట్ల లక్ష్యానికి గానూ రూ.116.68 కోట్లు (77.20 శాతం) వసూలైంది.
హిందూపురంలోనే ఎక్కువ..
జిల్లాలోని 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లక్ష్యం రూ.151.15 కోట్లు ఉండగా.. నవంబరు 30 నాటికి రూ.116.68 కోట్లు రాబడి వచ్చింది. అందులో హిందూపురంలో రూ.32.77 కోట్లు, ధర్మవరంలో రూ.20.75, కదిరిలో రూ.16.58 కోట్లు, పెనుకొండలో రూ. 15.78 కోట్లు, చిలమత్తూరులో రూ.15.42 కోట్లు, మడకశిరలో రూ.6.75 కోట్లు, సీకే పల్లిలో రూ.5.22 కోట్లు, తనకల్లులో రూ.3.21 కోట్లు మేర వసూలైంది.
టాప్‌లేపిన తనకల్లు..
తనకల్లు, మడకశిర, చిలమత్తూరు, సీకే పల్లి, పెనుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో లక్ష్యానికి మించి రాబడి వచ్చింది. తనకల్లులో 154.26 శాతం, మడకశిరలో 131.66, సీకే పల్లిలో 113.71, చిలమత్తూరులో 113.67, పెనుకొండలో 103.33, హిందూపురంలో 97.75, కదిరిలో 68.66, ధర్మవరంలో 59.17 మేర లక్ష్యం పూర్తయింది.
లక్ష్యంవైపు దూసుకెళ్తున్న
రిజిస్ట్రేషన్ శాఖ
టార్గెట్‌లో ఇప్పటికే 77.20 శాతం మేర వసూలు
తనకల్లు, మడకశిరలో
లక్ష్యానికి మించిన వైనం
చిలమత్తూరు, సీకే పల్లి, పెనుకొండలో ఆశాజనకం
హిందూపురం, ధర్మవరం
కార్యాలయాల నుంచి అధిక రాబడి
గతేడాది కంటే మెరుగు
గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం ఆశాజనకంగా ఉంది. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లక్ష్యం మించి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అన్ని కార్యాలయాల్లో వార్షిక లక్ష్యం వంద శాతం మించి వసూలుకు ప్రయత్నిస్తాం. దళారులతో సంబంధం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం. – కృష్ణకుమారి, జిల్లా రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment