నేడు ఎస్పీ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వి.రత్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పని సరిగా వెంట తీసుకొని రావాలన్నారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పెన్నహోబిలంలో
లడ్డూ ప్రసాదం కరువు
ఉరవకొండ: ప్రముఖ క్షేత్రమైన పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం కరువైంది. ఆరు నెలలుగా ప్రసాదం ఇవ్వకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందించేందుకు దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఇంత వరకూ టెండర్లు పిలవలేదు. ఇదిలా ఉండగా భక్తుల రద్దీ సమయంలో లడ్డూ ప్రసాదం ఇవ్వకపోతే బాగుండదని కొందరు సిబ్బంది సహకారంతో బయటి దుకాణాల్లోంచి తీసుకొచ్చిన లడ్డూలను విక్రయించారు. అయితే లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందని, అధిక ధర వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు బయటి లడ్డూలకూ మంగళం పాడేశారు. భక్తులు చేసేది లేక స్వామి దర్శనానంతరం తీర్థంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
విశా ఫెర్రర్‌కు ఉమెన్
అచీవ్‌మెంట్ అవార్డు
అనంతపురం: ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విశా ఫెర్రర్‌ను ‘సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవ్‌మెంట్ అవార్డు–2024’ వరించింది. ఆర్డీటీ తరఫున మహిళా సాధికారతకు విశేషంగా కృషి చేసినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం బెంగళూరులోని కేఈఏ ప్రభాత్ ఆడిటోరియంలో సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవ్‌మెంట్ అవార్డు (ఎస్‌ఐడబ్ల్యూఏఏ) సంస్థ సీఈఓ రాధ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
జిల్లా నుంచి
‘సంక్రాంతి’ బస్సులు
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని ఆరు డిపోల పరిధి నుంచి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లా వాసుల సౌకర్యార్థం సంక్రాంతికి 140 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు బస్సుల నిర్వహణపై సిబ్బందితో ఆదివారం ఆయన సమీక్షించారు. హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, విజయవాడ , చైన్నె తదితర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతి పండుగను సొంతూర్లలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వీరు సాధారణ చార్జీలతోనే రాకపోకలు సాగించేలా ప్రత్యేక సర్వీసులను కేటాయించారు. రిజర్వేషన్ చేయించుకునే వారికి పది శాతం రాయితీని అందజేస్తున్నారు. జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు హైదారాబాదు నుంచి 30, బెంగళూరు నుంచి 24, తిరుపతి నుంచి 10, విజయవాడ నుంచి 15, చైన్నె నుంచి 10 బస్సులతో పాటు లోకల్ రూట్లలో 51 సర్వీసులను నడపనున్నారు. ఇవే బస్సులు తిరిగి 16 నుంచి 19వ తేదీ వరకు ఆయా నగరాలకు బయలుదేరి వెళ్లేలా కార్యాచరణను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment