!
వాహనదారులకు
బాదుడే
హిందూపురం అర్బన్: వాహన యజమానులు ఇక జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే రహదారి నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు రవాణా, పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ‘హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదు’ అంటూ పోలీస్, రవాణాశాఖ అధికారులపై ఇటీవల హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఇక.. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచే నూతన రహదారి భద్రతా నియమాలు అమల్లోకి వచ్చాయి. అయితే వాటిని అంత పక్కాగా అమలు చేయలేదు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ, హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా అధికారులు నిబంధనలను కఠినతరం చేసేందుకు రెడీ అయ్యారు.
మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేలు
గతంలో మైనర్లు వాహనాలు వాడితే పెద్ద వారికి శిక్షపడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు.అలాగే మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
నిబంధనల ప్రకారం ఫైన్లు ఇలా..
● లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించే వారు. ఇప్పుడు దాన్ని రూ.5000కు పెంచనున్నారు.
● రెడ్‌లైట్‌ను ఉల్లంఘించి వాహనాలను నడిపితే రూ.500 ఫైన్ వేస్తారు.
● అతివేగంగా వాహనాన్ని నడిపితే రూ.1000 వసూలు చేస్తారు.
● రాంగ్‌రూట్‌లో వాహనాన్ని నడిపితే రూ.5000 ఫైన్ విధిస్తారు.
● డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం తాగి వాహనం నడిపితే) గతంలో రూ.2 వేలుగా ఉన్న ఫైన్‌ను ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పెంచారు.
● రేసింగ్, స్పీడ్ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు వసూలు చేయనున్నారు.
● హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు.
● అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే రూ.10 వేల పైన ఫైన్ విధించనున్నారు.
● ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే రూ.2 వేల వరకు చలాన్లు రాస్తారు.
● ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు ఇచ్చుకోవాల్సిందే.
లైసెన్స్ లేకపోతే రూ.5 వేలు
హెల్మెట్ వాడకపోతే రూ.వెయ్యి జరిమానా
జనవరి 1 నుంచి కఠినంగా అమలు చేస్తామంటున్న ఆర్టీఓ
నిబంధనలు పాటించాలి
జనవరి 1వ తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. రోడ్డు నిబంధనలు పాటించక పోవడం, వచ్చీరాని డ్రైవింగ్‌తో రోడ్లపైకి రావడం, మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనదారులు అతి జాగ్రత్త పాటించాలి. మలుపులు, సర్కిళ్ల వద్ద నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పదు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలి.
– కరుణసాగర్‌రెడ్డి,
జిల్లా రవాణాశాఖ అధికారి, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment