టీడీపీ ప్రచారంలో యానిమేటర్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రచారంలో యానిమేటర్‌

Published Wed, May 8 2024 12:45 AM

టీడీప

తలుపుల: మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో కొరుగుట్టుపల్లి యానిమేటర్‌ పార్థసారథి పాల్గొన్నారు. ఆ పార్టీ మండల కన్వీనర్‌ ముబారక్‌, మాజీ ఎంపీపీ మనోహర్‌రెడ్డితో కలసి ఇంటింటికీ తిరిగి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్‌కు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.

యువకుడి బలవన్మరణం

పెనుకొండ రూరల్‌: జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీ నాయక్‌ తెలిపిన మేరకు... పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంటకరెడ్డిపల్లికి చెందిన అనిల్‌కుమార్‌ (28) కొంత కాలంగా వ్యసనాలకు బానిసగా మారి జులాయిగా తిరగసాగాడు. తన అవసరాలు తీర్చుకునేందుకు డబ్బు సమకూరక పోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి రాంపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య షాలిని, ఎనిమిది నెలల వయసున్న కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

లేపాక్షి: మండలంలోని పి.సడ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ(38) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అవివాహితుడైన లక్ష్మీనారాయణకు కుటుంబసభ్యులు పలు సంబంధాలు చూసినా ఏవీ కుదరలేదు. దీంతో ఆయన మద్యానికి బానిసై జీవితం మీద విరక్తితో మంగళవారం తెల్లవారుజామున తాను కట్టుకున్న లుంగీతో పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి గంగాధరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

26న బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి జిల్లాలోని బలిజ విద్యార్థులకు ఈ నెల 26న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుడు టి.శంకరయ్య, కార్యవర్గ సభ్యులు మంగళవారం వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు ఆధార్‌కార్డు, మార్కుల జాబితా, టీసీ లేదా కులధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు జతచేసి ఈ నెల 24వ తేదీలోపు ‘అధ్యక్షుడు, రాయలసీమ బలిజ సంఘం, శ్రీనివాసనగర్‌, అనంతపురం’ చిరునామాకు పోస్టు ద్వారా లేదా, స్వయంగా అందజేయవచ్చు. పూర్తి వివరాలకు 98664 19693, 92477 92567, 94901 80177లో సంప్రదించవచ్చు.

రైలు నుంచి జారి పడిన వ్యక్తి

గుంతకల్లు: కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన వెంకటాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో వెలుగు చూసింది. వివరాలు... కర్ణాటకలోని వాడి ప్రాంతానికి చెందిన వెంకటేష్‌... బెంగళూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కర్ణాటకలో లోకసభ ఎన్నికలకు సంబంధించి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మంగళవారం బెంగుళూరు నుంచి నాంథేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వాడికి బయలుదేరాడు. కల్లూరు–గుంతకల్లు సెక్షన్‌లోని వెంకటాంపల్లి రైల్వేస్టేషన్‌ దాటి సుమారు 5 కి.మీలు ప్రయాణించిన తర్వాత బాత్రూంకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి వెంకటేష్‌ జారి కిందపడ్డాడు. ఘటనలో తలకు, కాళ్లకు బలమైన రక్తగాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న గ్యాంగ్‌మెన్‌లు ఈ విషయాన్ని గుర్తించి వెంకటాంపల్లి రైల్వేస్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం చేరవేశారు. స్టేషన్‌ మాస్టర్‌ నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చిక్సిత కోసం అనంతపురానికి రెఫర్‌ చేశారు.

మాదిగల ద్రోహి మందకృష్ణ

ఎంఆర్‌ పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కుంటిద్ది ఓబిలేసు

అనంతపురం టవర్‌క్లాక్‌: మాదిగల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన మందకృష్ణ... మాదిగల ద్రోహిగా మారాడని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిద్ది ఓబులేసు ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురంలోని ఎన్‌జీఓ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగలు తన వెంటే ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్న మందకృష్ణ మాదిగ వైఖరిని తప్పుబట్టారు. మాదిగలకు న్యాయం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఎమ్మార్పీఎస్‌ అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు కలిసికట్టుగా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మంద కృష్ణయ్య, నాగరాజు, ముత్యాలు, సూరి, జె.ముత్యాలు, ఆదిశేషు, గురుశంకరనారాయణ, చదువు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ ప్రచారంలో యానిమేటర్‌
1/1

టీడీపీ ప్రచారంలో యానిమేటర్‌

Advertisement
Advertisement