దక్కుతున్న ఉపాధి ఫలాలు
పుట్టపర్తి అర్బన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన ఉపాధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే జిల్లా వాసులకు దక్కుతున్నాయి. ఏటా వేసవిలో ప్రతి కుటుంబానికీ వంద రోజుల పనులను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించడమే కాక.. చేసిన పనులకు వెంటనే కూలిని కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తూ వచ్చారు. దీంతో అప్పట్లో ఉపాధి పనుల్లో పాలు పంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో 2.2 లక్షల జాబ్ కార్డులుండగా మొత్తం 3.87 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరిలో వ్యవసాయ పనులకు వెళ్లే వారిని మినహాయిస్తే దాదాపు 1.8 లక్షల మంది కూలీలకు ఏటా వంద రోజుల పనులు కల్పించారు. రోజూ రూ.300 చొప్పున కూలి అందుతుండడంతో అప్పట్లో ఉపాధి పనులల్లో కూలీలు సగర్వంగా పాలుపంచుకుంటూ వచ్చారు.
ఏటా రూ.కోట్లలోనే పనులు..
వైఎస్సార్‌సీపీ హయాంలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను 79.53 లక్షల పని దినాలకు సుమారు రూ.170.8 కోట్లను ఖర్చు చేశారు. 2023–24లో 78.35 లక్షల పని దినాలకు గాను రూ.176.57 కోట్లు ఖర్చు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకూ 72.68 లక్షల పని దినాలకు రూ.187.32 కోట్లు వెచ్చించారు. గతంలో ఉపాధి పనులకు వెళ్తే రూ.300 వరకూ కూలి గిట్టుబాటయ్యేది. చెరువుల్లో పూడిక తీత పనులు, ఫారం ఫాండ్ల ఏర్పాటు, మెట్ట భూముల్లో ఉద్యాన మొక్కల నాటేందుకు గుంతలు తవ్వడం, మొక్కల పెంపకం, ఖండిత కందకాలు, కొండ చుట్టూ ట్రెంచ్, చెక్ డ్యాంల్లో పూడిక తీత, భూముల చదును పనులు, రోడ్ల ఏర్పాటు తదితర పనులు చేయించారు.
భూగర్భ జలాల పెంపు..
గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు తోడు విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెంపొందాయి. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనుల్లో వర్షపు నీళ్లు నిలబడి పచ్చదనం సంతరించుకుంది. చెరువుల్లో తీసిన పూడిక తీత పనుల ద్వారా ఏర్పడిన గుంతల్లో భారీగా వర్షం నీళ్లు నిలుస్తున్నాయి. కొండల చుట్టూ కొట్టిన ట్రెంచ్‌లలో వర్షం నీరు ఎక్కడికక్కడే ఇంకి పోయి జిల్లాలో సగటున 9.46 మీటర్లకు భూగర్భజలాలు ఎగబాకాయి. ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్న గత మే నెలలో 17.67 మీటర్లుగా భూగర్భ జలాలు నమోదు కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఎటు చూసిన బోరు బావుల్లో సమృద్ధిగా నీళ్లు లభ్యమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు అక్టోబర్ 24 నాటికి 5.23 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకినట్లు ఆ శాఖ అధికారి మల్లికార్జున రావు తెలిపారు.
విస్తారంగా పండ్ల తోటలు..
ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో మెట్ట భూముల్లో పండ్ల తోటల సాగును అధికారులు ప్రోత్సహిస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు, డ్రిప్పు, స్పింక్లర్లను సబ్సిడీపై అందించడంతో రైతులు ముందుకు వచ్చి పండ్ల తోటల సాగు చేపట్టారు. ఏటా 10 వేల హెక్టార్లకు డ్రిప్పు పరికరాలను అప్పట్లో రైతులకు అందించారు. గత మూడేళ్లలో 13,921 హెక్టార్లలో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. పండ్ల తోటల్లో సైతం ట్రెంచ్ ఏర్పాటు, మొక్కల చుట్టూ పాదుల పనులను ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేయడంతో వర్షం నీరు సమృద్ధిగా నిలిచి తోటలు జీవం పోసుకున్నాయి.
జిల్లాలో
జాబ్ కార్డుల సంఖ్య
2.2 లక్షలు
గత ప్రభుత్వంలో ఏడాదికి చేపట్టిన పనుల విలువ
పెరుగుతున్న భూగర్భ జలాలు
ఉద్యాన పంటలకు మహర్దశ
ఉపాధి పనుల ఫలితాలు దక్కాయి
జిల్లాలో గతంలో చేసిన ఉపాధి పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కూలీలకు చేతినిండా పని దొరకడంతో పాటు పండ్ల తోటల పెంపకం, భూగర్భ జలాల పెంపు ఇలా ఎన్నో విధాలుగా ఫలితాలు దక్కాయి. రైతులు పండ్ల మొక్కల పెంపకానికి ముందుకొస్తున్నారు. పనులకు వస్తే నిరంతరం ఉపాధి కల్పిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపుతున్నాం. బిల్లులు సైతం సకాంలో చెల్లిస్తున్నాం.
– విజయ్‌ప్రసాద్, డ్వామా పీడీ
రూ.170
కోట్లకు పైగా
Comments
Please login to add a commentAdd a comment