ఎలక్ట్రానిక్స్‌తో అన్ని విభాగాలు మమేకం
అనంతపురం: ఎలక్ట్రానిక్స్ విభాగంతో అన్ని విభాగాలు మమేకం అయ్యాయని జేఎన్‌టీయూఏ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు తెలిపారు. జేఎన్‌టీయూఏ క్యాంపస్ కళాశాలలోని ఈసీఈ విభాగంలో ఈ–మెర్జ్ 2కే24 పేరుతో మంగళవారం జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్‌చార్జ్ వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా, పి.జయప్రకాష్ (ఆలోనెల్ టెక్నాలజీ, బెంగళూరు) గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జి. మమత, డాక్టర్ లలితకుమారి కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. హెచ్.సుదర్శనరావు మాట్లాడుతూ... సాంకేతిక రంగం అభివృద్ధిలో వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు.
రూ.8 కోట్ల విలువైన ఆవిష్కరణ..
ప్రాజెక్ట్ అనంత పేరుతో ఐఓటీ ప్రాసెసర్‌ను ఈసీఈ విభాగం విద్యార్థులు, అధ్యాపకులు ఆవిష్కరించారు. రూ.8 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను నయాపైసా ఖర్చు లేకుండా రూపకల్పన చేశారు. పరిశోధనా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ ఆవిష్కరణను సమాజానికి చేరువ చేసేందుకు వీలుగా పరిశ్రమకు అప్పగించారు. మంగళవారం ఈ–మెర్జ్ పేరుతో నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ ఆవిష్కరణ పారిశ్రామికవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను విశేషంగా ఆకర్షించింది. ఎస్‌ఓసీ (సిస్టమ్ ఇన్ చిప్)ను డిజైన్ చేసి ఐఓటీ ప్రాసెస్ ద్వారా పనిచేసేలా కృషి చేశారు. చిప్ లేకుండానే డివైజ్ పనిచేయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం థియరీ టెస్టింగ్ పూర్తయింది. అనంతరం ప్రోటో టైప్ పూర్తిచేసిన తరువాత ఫ్యాబ్రికేషన్ అసెంబుల్ చేయనున్నారు. అనంతరం పరిశ్రమలో వస్తువు ఉత్పత్తిని చేపడతారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా చిప్‌లెస్ డిజైన్ పూర్తి చేయడం ప్రశంసనీయం అని వర్సిటీ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిశోధనలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జి. మమత పర్యవేక్షణలో విద్యార్థులు చరణ్, అర్జున్, హేమంత్, మధు, పెంచల్, సుధ, షణ్ముఖ్, హరిణి, చరిత, అక్షయ, హిమశ్రీ, ఉజ్వల, గీతాభవాని భాగస్వామ్యం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment