దారికాచిన మృత్యువు
మడకశిర రూరల్: మండల పరిధిలోని బుళ్లసముద్రం సమీపంలో 544ఈ– జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని టెంపోట్రావెలర్ వెనుక నుంచి ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా...
గుడిబండ మండలం కేఎన్ పల్లి గ్రామానికి చెందిన శివరాజు, ప్రేమకుమారి(30) దంపతులకు అథర్వ (2), మరో కూతురు సంతానం. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శివరాజు తన కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించేందుకు కుటుంబీకులు, బంధువులతో కలిసి మొత్తం 23 మంది గురువారం సాయంత్రం ఓ టెంపో ట్రావెలర్, మరో రెండు కార్లలో తిరుమల వెళ్లారు. శుక్రవారం తిరుమలలో అథర్వ నామకరణం, తలనీలాల కార్యక్రమం ముగించుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామం కేఎన్ పల్లికి తిరుగు పయనమయ్యారు. శివరాజు, కుమార్తె కారులో బయలుదేరగా.. భార్య ప్రేమకుమారి, కుమారుడు అథర్య బంధువులతో పాటు టెంపో వాహనంలో పయనమయ్యారు. ఈ వాహనం శనివారం తెల్లవారుజామున మడకశిర మండలం బుళ్లసముద్రం గ్రామ సమీపంలోకి రాగానే 544ఈ– జాతీయ రహదారిపై ముందు నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో ప్రేమకుమారి, అథర్వతో పాటు అమరాపురానికి చెందిన శివరాజు పెద్దమ్మ రత్నమ్మ(65) పాటు పావగడ తాలూకా కొండపురం గ్రామానికి చెందిన డ్రైవర్ మనోజ్(32) మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, మడకశిర ఫోర్ వీలర్ అసోసియేషన్ వాహనాల్లో మడకశిర ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ఈ ఘనటపై మడకశిర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నామకరణమే చివరి సంబరం..
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... అందులో శివరాజు భార్య ప్రేమకుమారి, కుమారుడు అథర్వతోపాటు శివరాజు పెద్దమ్మ రత్నమ్మ ఉండటంతో ఆ ఇంట విషాదం నెలకొంది. కుమారుడు అథర్వకు నామకరణం చేసి గంటలు గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శివరాజు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కారులో వెళ్దామని తాను పిలిచినా బంధువులతో పాటూ వస్తామంటూ టెంపోలో ఎక్కారని, అవే తన భార్య చివరిమాటలవుతాయని ఊహించలేకపోయానని అతను కన్నీరమున్నీరయ్యారు. ఇక మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చిన్నారి అథర్వ మృతదేహం చూసిన వారంతా ‘అయ్యో ఎంత పని చేశావు దేవుడా అంటూ’ కన్నీరుమున్నీరయ్యారు.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమరాపురం మండలం శివరానికి చెందిన నాగమణి, గుడిబండ మండలం కేఎన్‌పల్లికి చెందిన గీతమ్మ, శ్రీదేవి, టీచర్ సుజాతమ్మ, కమలమ్మ, గంగమ్మ, కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హరిబ్బికి చెందిన శ్వేత, పావగడ తాలుకాలోని హర్తికేరేకు చెందిన గిరిజమ్మ, ఉమేష్, అమ్మాజమ్మ, చిత్రదుర్గ జిల్లాకు చెందిన రవీంద్రలను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న తమవారిని చూసి తల్లడిల్లిపోయారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 10 మందిని మెరుగైన వైద్యం కోసం తుమకూరుకు తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మడకశిర ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
డ్రైవర్ వద్దన్నా..
తనకు నిద్ర వస్తోందని, కొద్దిసేపు పడుకుని వెళ్దామని డ్రైవర్ మనోజ్ చెప్పినా వాహనంలోని వారు వినలేదని తెలిసింది. వారి ఒత్తిడితో డ్రైవర్ గత్యంతరం లేని పరిస్థితిలో బయలు దేరినట్లు తెలిసింది. డ్రైవర్ మాట విని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు.
నేనెట్లా బతికేది ..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ మనోజ్ ఆరేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వినుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రమాదంలో అతను మృతి చెందగా..నేనెట్లా బతికేది దేవుడా అంటూ భార్య వినుత బిగ్గరగా రోదించారు.
విషాదఛాయలు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కేఎన్ పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృత దేహాలకు జెడ్పీటీసీ అనంతరాజు, వైఎస్సార్ మండల కన్వీనర్లు యంజారేగౌడు, నరసింహారెడ్డి నివాళులర్పించారు.
మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న
టెంపో ట్రావెలర్
నలుగురు మృత్యువాత..
11 మందికి తీవ్ర గాయాలు
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు
తిరుమల వెంకన్నను దర్శించుకుని వస్తుండగా ఘటన
Comments
Please login to add a commentAdd a comment