భోజనం బాగుంటుందా..?
● హాస్టల్ విద్యార్థులను ఆరా తీసిన
మంత్రి సవిత
పుట్టపర్తి: ‘‘భోజనం బాగుంటుందా...మెనూ మేరకు అందిస్తున్నారా.. హాస్టళ్లలో వసతులు ఎలా ఉన్నాయి..ఏమైనా ఇబ్బందులున్నాయా’’ అని బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవిత విద్యార్థులను ఆరా తీశారు. శనివారం ఆమె బుక్కపట్నంలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల, బీసీ బాలికల కళాశాల హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు దోమల బెడద లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక బీసీ బాలికల కళాశాల హాస్టల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మంత్రి వెంట ప్రిన్సిపాల్ రమాదేవి, హాస్టల్ వార్డెన్ లలిత, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
బాధితులను ఆదుకోవాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్
పెనుకొండ రూరల్: మడకశిర మండలం బుల్లసముద్రం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన తనను కలచి వేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున బుల్లసముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెల్స్ వాహనం ఢీ కొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, 11 మంది గాయపడటం విచారకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని వైఎస్సార్ సీపీ తరుఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు.
ఏజెన్సీల ద్వారా
ఇసుక లోడింగ్‌కు అనుమతి
ధర్మవరం అర్బన్: జిల్లాలోని రెండు ఇసుక రీచ్‌లలో ఏజెన్సీల ద్వారా ఇసుక లోడింగ్‌కు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తాడిమర్రి మండలం సీసీ రేవు ఇసుక డిపో వద్ద విరంచి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముదిగుబ్బ మండలం పీసీ రేవు డిపో వద్ద కేఎల్‌ఎన్ ఎంటర్ ప్రైజెస్‌ను ఏజెన్సీలుగా నియమించినట్లు ఆర్డీఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక కావాల్సిన వారు రీచ్ దగ్గరికి వాహనంతోపాటు వెళ్లి టన్నుకు రూ.260 చొప్పున చెల్లిస్తే ఏజెన్సీ నిర్వాహకులు ఇసుక లోడ్ చేసి ఇస్తారన్నారు. నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల వారు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లటానికి అవకాశముందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment