ధర్మవరంలో దద్దరిల్లిన నినాదాలు..
కరెంటు చార్జీలు పెంచబోమని నమ్మించి దగా చేసిన కూటమి
సర్కార్‌పై జనం కన్నెర్ర చేశారు.
పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి కదం తొక్కారు. నినాదాలు..నిరసనలతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జోరువానలోనూ ‘పోరుబాట’ కొనసాగించారు. పెంచిన చార్జీలు తగ్గించకపోతే తడాఖా చూపుతామని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలో చేపట్టిన విద్యుత్ ‘పోరుబాట’ కార్యక్రమం విజయవంతమైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలతో పాటు అన్ని వర్గాల వారూ స్వచ్ఛందంగా తరలిరావడం చూసి కూటమి నేతలకు గుబులు పట్టుకుంది.
సాక్షి, పుట్టపర్తి
విద్యుత్ చార్జీలపై వైఎస్సార్‌సీపీ నిరసన హోరు జోరువానలోనూ కొనసాగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎందాకై నా వెళ్తామంటూ.. వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఊరూవాడా ఏకమై నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. ఓ వైపు వరుణుడు విజృంభిస్తున్నా.. ప్రజలు లెక్క చేయకుండా వచ్చారు. ఆయా నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల నేతృత్వంలో సాగిన ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన గళం వినిపించారు. భారీ జన సందోహం మధ్య విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి ‘బిల్లులు తగ్గించాలని కోరుతూ’ వినతిపత్రం అందజేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన నివాసం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి కాలేజీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా మార్కెట్‌లో నుంచి విద్యుత్ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. ఈసందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బిల్లుల భారం భరించలేనిదిగా మారిందన్నారు. బిల్లుల మోత తగ్గించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్మవరం దద్దరిల్లింది. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గుర్రం శ్రీనివాసరెడ్డి, మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మక్బూల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కదిలారు. పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా ట్రాన్స్ కో కార్యాలయం వరకు వెళ్లారు. భారీ జనాల మధ్య కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. నాయకులు ముందుకు సాగారు. అనంతరం బిల్లుల భారం తగ్గించాలని కోరుతూ ట్రాన్స్ కో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మక్బూల్ మాట్లాడుతూ.. కలిసికట్టుగా ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాసరెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి భారీ జన సందోహంతో విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అధికారులను కలిసి విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సాయిలీల, జిల్లా నాయకులు అవుటాల రమణారెడ్డి, నసనకోట ముత్యాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అధిష్టానం పిలుపు మేరకు మడకశిరలో నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ‘పోరుబాట’లో భారీగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నర్సేగౌడ, రాష్ట్ర నాయకులు రంగేగౌడ, జీబీ శివకుమార్, జెడ్పీటీసీ అనంతరాజు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో.. స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో విద్యుత్ బిల్లుల భారంపై నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం అక్కడి నుంచి ట్రాన్స్ కో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి.. అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ దీపిక మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల భారం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత వేణురెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు నాగమణి, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, మండలాల కన్వీనర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
రాప్తాడులో నిర్వహించిన పోరుబాటులో జనం గర్జించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలపై భారం పడకుండ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తే, కూటమి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. కార్యక్రమంలో సీకే పల్లి ఎంపీపీ అంజలి, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, అనంతపురం రూరల్ ఎంపీపీ వరలక్ష్మి పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా రోడ్డెక్కిన వైఎస్సార్‌సీపీ నేతలు
జోరు వర్షంలోనూ
కొనసాగిన పోరుబాట
నియోజకవర్గకేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు
కదం తొక్కిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు
స్వచ్ఛందంగా తరలివచ్చి
మద్దతు తెలిపిన ప్రజలు
చార్జీలు తగ్గించాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాల అందజేత
పెనుకొండలో పెనుతుపానులా..
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెనుకొండలోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని.. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాల్మీకి విభాగం అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, కౌన్సిలర్లు సుధాకర్‌రెడ్డి, వైశాలి జయశంకర్‌రెడ్డి, మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురంలో నిరసనాగ్రహం..
రాప్తాడులో జనగర్జన..
పుట్టపర్తిలో భారీ ర్యాలీ..
కదిరిలో కలిసికట్టుగా...
మడకశిరలో కొనసాగిన నిరసన..
Comments
Please login to add a commentAdd a comment