టీడీపీ నేతల మెడకు ఉచ్చు
చిలమత్తూరు: స్థానిక పంచాయతీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయం నిర్మాణం కోసం అంటూ టీడీపీ నేతలు... సర్పంచ్‌ను బెదిరించి పంచాయతీ నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. శనివారం డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి రామ్లా నాయక్, సర్పంచ్ సంధ్య, కార్యాలయ అధికారులను బిల్లులపై సమగ్రంగా విచారణ జరిపారు. సంబంధిత ఎం–బుక్కులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకువెళ్లారు. బిల్లులు మంజూరుకు దారి తీసిన పరిస్థితులు, ఎందుకు డ్రా చేశారన్న విషయాలను కార్యదర్శితో నోట్ రాయించుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే బిల్లులు మంజూరు చేశామని విచారణ సందర్భంగా కార్యదర్శి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో తనను అనవసరంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. విచారణలో తేలిన అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఎల్‌పీఓ మీడియాకు తెలిపారు.
బెదిరించి బిల్లులు చేసుకున్నారు..
‘‘బిల్లులు పెట్టాలని టీడీపీ నేత నందీశప్ప నాపై ఒత్తిడి తెచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయం కట్టాలని, అందుకోసం చెప్పిన చోటల్లా సంతకం చేయాలని బెదిరించారు. నగదు డ్రా చేసి ఇవ్వకపోతే చెక్ పవర్ తీసేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు’’ అని సర్పంచ్ సంధ్య విచారణ అధికారికి తెలిపారు. అంతేకాకుండా పీఎఫ్‌ఎంఎస్ తన మొబైల్ నంబరు తొలగించి వేరొకరి నంబరు అప్‌డేట్ చేయించారని, ఆ విషయం కూడా తనకు తెలియదని ఆమె వివరించారు. అలాగే తుమ్మలకుంటలో బోరుబావి కోసం రూ.2.50 లక్షలు వరకూ ఖర్చు చేసే అవకాశం ఉందని చెప్పి ఏకంగా రూ.6.61 లక్షలకు బిల్లు పెట్టుకున్నారని, భైరవేశ్వరుడి ఆలయం వద్ద మరుగుదొడ్లు నిర్మించినట్టుగా మరో రూ. 6 లక్షల మేర బిల్లులు చేయించుకున్నారని సర్పంచ్ సంధ్య విచారణ అధికారికి తెలిపారు. దేవుడి విషయం కావడంతో తానేమీ మాట్లాడలేక పోయానని, అయితే అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదని సర్పంచ్ విచారణ అధికారికి వెల్లడించారు.
చిలమత్తూరు పంచాయతీ నిధుల
దుర్వినియోగంపై విచారణ ప్రారంభం
ఎమ్మెల్యే కార్యాలయ నిర్మాణం కోసం నిధులు కావాలని టీడీపీ నేతలు
బలవంతంగా బిల్లులు పెట్టించారు
డీఎల్‌పీఓ ఎదుట వాపోయిన
సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment