తప్పని నిరీక్షణ..
● పుట్టపర్తి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకే డిపార్ట్
● సాయంత్రం 6.15 వరకు ధర్మవరం స్టేషన్‌లోనే..
● ధర్మవరంలో రెండు గంటల పాటు హాల్ట్
● సమయం మార్చడంతో ప్రయాణికుల ఇక్కట్లు
ధర్మవరం రైల్వేస్టేషన్‌లో
నిలిచిన కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు
సాక్షి, పుట్టపర్తి
పుట్టపర్తి జిల్లా కేంద్రం అయ్యాక రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా అప్పటి వరకూ అనంతపురంలో ఉన్న ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టపర్తికి మకాం మార్చారు. అయితే చాలా మంది పెద్దల ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువుల దృష్ట్యా రోజూ అనంతపురం నుంచే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇలాంటి వారికి గతంలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ (17212) ఎంతో ఉపయోగపడేది. అయితే ఇటీవల ఆ రైలు వేళల్లో మార్పు కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
ధర్మవరం నుంచి సమయం మార్పు..
వారంలో మూడు (మంగళ, గురు, శనివారం) రోజుల పాటు యశ్వంతపూర్ – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు మారిన వేళల మేరకు రెండు గంటల ముందే నడుస్తోంది. అయితే కేవలం యశ్వంతపూర్ నుంచి ధర్మవరం వరకు మాత్రమే.. టైమింగ్ మారింది. ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు పాత షెడ్యూల్ ప్రకారమే నడుస్తోంది. ఈ రైలు గతంలో సాయంత్రం 5.20 గంటలకు పుట్టపర్తికి వచ్చేది. అయితే ప్రస్తుతం 3.30 గంటలకే వస్తోంది. దీంతో జిల్లా కేంద్రం పుట్టపర్తిలో విధులు ముగించుకుని అనంతపురం వెళ్లే ఉద్యోగులకు, ఇతర వర్గాల వారికి కొండవీడు ఎక్స్‌ప్రెస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో పుట్టపర్తి నుంచి అనంతపురం వెళ్లాల్సిన ఉద్యోగులు సాయంత్రం 6.40 గంటలకు వచ్చే కాచిగూడ రైలు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.
టీచర్లకు తప్పని తిప్పలు..
పుట్టపర్తి చుట్టుపక్కల పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలామంది తమ పిల్లలను గుడివాడ, విజయవాడలో చదివిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం విధులు ముగిశాక కొండవీడు రైలు ఎక్కి వెళ్లేవారు. అయితే ప్రస్తుతం కొండవీడు రైలు పట్టుకోవాలంటే మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సెలవు పెట్టి రైలు ఎక్కినా.. రెండు గంటల పాటు ధర్మవరంలో సమయం వృథా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు ముగిశాక బయలుదేరితే నేరుగా ధర్మవరం స్టేషన్ చేరుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని వాపోతున్నారు.
మధ్యాహ్నం 1.15 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరే కొండవీడు ఎక్స్‌ప్రెస్ యలహంక, హిందూపురం, పెనుకొండ మీదుగా పుట్టపర్తి ప్రశాంతినిలయం స్టేషన్‌కు 3.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ధర్మవరానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అక్కడ 2.15 గంటల పాటు వేచి ఉండాల్సి రావడంతో యశ్వంతపూర్, హిందూపురం, పుట్టపర్తిలో ఎక్కిన ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్నారు.
వేళలు మార్చాలి
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి నిమిషమూ విలువైనదే. ప్రయాణికులతో ఉన్న రైలును ఒకే స్టేషన్‌లో రెండున్నర గంటల పాటు నిలపడం సమంజసం కాదు. రైల్వే అధికారులు మరోమారు పరిశీలించి వేళల్లో మార్పులు చేస్తే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే మార్చిన వేళలతో ప్రజలకు నష్టం తప్ప లాభం ఉండదు.
– లాయర్ హరికృష్ణ, పుట్టపర్తి
ఎందుకు మార్చారో?
కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఇంతకుముందు సరైన సమయానికే నడిచేది. ఉన్నఫళంగా టైమింగ్ మార్చారు. దీంతో హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తిలో ఎక్కే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి ఈ రైలు ఉపయోగపడటం లేదు. ధర్మవరంలో వెయిటింగ్ ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. – పాటిల్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment