రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
పెనుకొండ రూరల్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. కూటమి సర్కార్ చేతగాని తనం వల్ల రోజుకోచోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. సోమవారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. ఆదివారం పరిగి మండలంలో అభం, శుభం తెలియని ఏడేళ్ల బాలికను సునీల్ కుమార్ అనే వ్యక్తి లొంగదీసుకొనే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నియోజకవర్గంలోనే ప్రజలకు భద్రత కరువైందన్నారు. మంత్రి సవితకు మహిళల భద్రతపై బాధ్యత లేదా.. అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ‘దిశ ’యాప్, దిశ పోలీస్ స్టేషన్‌లు కనుమరుగుయ్యాయన్నారు. ఫలితంగా మహిళలకే కాదు ముక్కుపచ్చలారని పసిపిల్లలకు కూడా భద్రత కురువైందన్నారు. ఇప్పటికై నా ఈ ప్రభుత్వం స్పందించి మహిళల భద్రతకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
టీచర్ విజయ భార్గవికి
రాష్ట్రస్థాయి బహుమతి
పుట్టపర్తి/మడకశిర రూరల్: సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 3న నిర్వహించిన టీచర్స్ ఫెస్ట్ పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు విజయ భార్గవి సత్తా చాటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీచర్లకు నిర్వహించిన సైన్స్ ఫేర్‌లో మడకశిర మండలం రేకులకుంట ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు విజయ భార్గవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌కు మొదటి బహుమతి దక్కింది. దీంతో ఆమెకు తెలంగాణ హైకోర్టు జడ్జి రాధారాణి ప్రశంసా పత్రంతో పాటు రూ.5 వేల నగదు బహుమతి అందించారు. ప్రతిభ కనబరచి జిల్లా ఖ్యాతిని చాటిన విజయ భార్గవిని డీఈఓ కృష్ణప్ప, జిల్లా సెన్సు అధికారి తనూజ్ కుమార్‌తో పాటు పాఠశాల హెచ్‌ఎం గిరిజ, ఉపాధ్యాయులు అభినందించారు.
జనసేన కార్యకర్తపై
బీజేపీ నాయకుల దాడి
ధర్మవరం: దళిత సామాజిక వర్గానికి చెందిన జనసేన కార్యకర్తపై బీజేపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితుడు బాలకృష్ణ సోమవారం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీని దళిత సామాజిక వర్గానికి చెందిన జనసేన కార్యకర్త బాలకృష్ణకు ప్రభుత్వం కేటాయించింది. అయితే బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి, అతని అనుచరులు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహించకుండా బాలకృష్ణను అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సితార్ గ్రాండ్ వద్ద బాలకృష్ణ టీ తాగుతుండగా, బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి బావమరిది ప్రతాప్‌రెడ్డి, మరో నలుగురు అనుచరులు వచ్చి ‘రాజారెడ్డి చెప్పినా... వినవా’ అంటూ కులం పేరుతో దూషించడంతో పాటు మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో బాలకృష్ణ ప్రాణభయంతో డీఎస్పీ ఆఫీస్‌లోకి వెళ్లడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో గాయపడిన బాలకృష్ణ ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం సాయంత్రం పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి, గొళ్లొళ్లపల్లి వెంకి, రాజారెడ్డి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment