గడువులోపు అర్జీలన్నీ పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలన్నీ గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇంటి పట్టాలు, ఇళ్ల మంజూరు, పట్టాదారు పాసు పుస్తకాలు, రస్తా సమస్యలు తదితర వాటిపై మొత్తంగా 215 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఇందుకోసం ముందుగానే అర్జీదారుడితో మాట్లాడితే సమస్య గురించి క్షుణ్ణంగా తెలుస్తుందని, అప్పుడు మెరుగైన పరిష్కారం చూపవచ్చన్నారు. కోర్టు కేసులు, ఆర్థిక పరమైన కేసులు మినహా ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులను ఆయా శాఖల అధికారుల వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓలు కుల సర్వేకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సమర్పించాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా జిల్లాలో సోమందేపల్లి మండలం నాగేనాయన చెరువు తండా, తనకల్లు మండలం ముండ్లవారి పల్లి తండా, గాండ్లపెంట మండలం తుమ్మల బైలు గ్రామం ఎంపికయ్యాయని తెలిపారు. అన్ని శాఖల విభాగ అధిపతులు వారి శాఖల ఆధ్వర్యంలో 18 అంశాల వారీగా అంచనాలు, అవసరాలు వివరాల నివేదికను అందజేయాలన్నారు. శాఖల వారీగా వ్యక్తిగత లబ్ధి, కమ్యూనిటీ లబ్ధి వివరాల జాబితాను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్‌డీఎం రమణకుమార్, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, డీఈఓ కృష్ణప్ప, పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, వ్యవశాఖ శాఖ అధికారి సుబ్బారావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
కుష్టువ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి..
జిల్లాలో కుష్టు వ్యాధి నివారణకు సంబంధిత అధికారులందరూ సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుష్టువ్యాధి నిర్ధారణ, లక్షణాలపై గ్రామగ్రామానా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటినీ సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలపై స్వీయ పరీక్ష చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఎండీటీ మందులు అందిస్తారన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment