ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
● కొత్తచెరువు కళాశాలలో
ప్రారంభించిన కలెక్టర్ చేతన్
పుట్టపర్తి అర్బన్: పట్టణాల్లోని కళాశాలలకు వచ్చే గ్రామీణ విద్యార్థులు చాలా మంది మధ్యాహ్నం వేళ భోజనం తినలేని పరిస్థితులు ఉన్నాయని, అందుకే ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థి పస్తు ఉండకూడదన్న లక్ష్యంతో ఇంటర్ కళాశాలల్లోనూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ చేతన్ అన్నారు. శనివారం ఆయన డీఈఓ కృశ్ణప్పతో కలిసి కొత్తచెరువు ఇంటర్ కళాశాలలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 21 ఇంటర్ కళాశాలల్లో 6,220 మంది చదువుకుంటున్నారని, వారందరికీ ఇక నుంచి రోజూ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు దీటుగా రాణించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.
మత్తుకు దూరంగా ఉండాలి..
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కారాదని కలెక్టర్ హితవు పలికారు. డ్రగ్స్ మీతో పాటు మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. సెల్‌ఫోన్లు కూడా కేవలం విజ్ఞానానికి మాత్రం వినియోగించాలన్నారు. క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించడంతో పాటు వారితో కలసి భోజనం చేసారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ రఘునాథరెడ్డి, ఎంఈఓ జయచంద్ర, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓ నటరాజ్, ప్రిన్సిపాల్ జ్యోతిర్లత, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment