సమష్టి కృషితోనే స్వచ్ఛత సాధ్యం
పుట్టపర్తి అర్బన్: యంత్రాంగం, ప్రజల సహకారంతో స్వచ్ఛతవైపు అడుగులు వేస్తున్నామని, త్వరలోనే శ్రీసత్యసాయిని స్వచ్ఛ జిల్లాకు చిరునామాగా మారుస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. శనివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’లో డీపీఓ సమంత, మండల స్పెషలాఫీసర్ శుభదాస్, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్ తదితరులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ, ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, వీధులు తదితర ప్రదేశాల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ పరిసరాలను అందించే లక్ష్యంతో అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఒక్కో నెల ఒక్కో థీంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘స్వచ్ఛ’ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ప్రజలతో కలిసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలోని వీధులు, మురుగు కాలువలు, పైప్‌లైన్లను నిశితంగా పరిశీలించారు. గ్రామంలో ఆలయం వద్ద మానవహారం ఏర్పాటు చేసి ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’పై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతు నరసింహమూర్తి నిర్మించిన గోకులాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కప్పలబండ, వెంకటగారిపల్లి సర్పంచ్‌లు చిన్న పెద్దన్న, లక్ష్మీనరసమ్మ, జగరాజుపల్లి వైస్ సర్పంచ్ జనార్దన్, తహసీల్దార్ అనుపమ, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, నాయకులు మల్లిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’లో
కలెక్టర్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment