నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
పుట్టపర్తి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు వరుసగా 10 రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
పరీక్షలకు
తప్పక హాజరు కావాలి
పుట్టపర్తి: ఇంటర్మీడియట్ ప్రీఫైనల్ పరీక్షలు ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు డీవైఈఓ రఘనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. అలాగే ఫిబ్రవరి 1న జరిగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష , 3న జరిగే ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని పేర్కొన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వి.రత్న ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని సూచించారు.
వలస బాటలో మృత్యువాత
రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృత్యువాత పడ్డాడు. అయిన వారికి తీరని శోకం మిగిల్చాడు. వివరాలు.. మండలంలోని రాయంపల్లికి చెందిన విశ్వనాథ్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఎక్కడా ఉపాధి దొరక్కపోవడంతో కుటుంబ పోషణ కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు 15 రోజుల క్రితం విశ్వనాథ్ వలస వెళ్లాడు. అక్కడ కూలీ పనులకు వెళ్తూ వారానికోసారి భార్యకు నగదు పంపుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం పని ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స కోసం స్థానికులు అక్కడి ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన విశ్వనాథ్.. ఆదివారం ప్రాణాలు వదిలాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.
రిమాండ్‌కు 11 మంది
పెనుకొండ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వివాహితపై దాడి కేసులో 20 మందిపై కేసు నమోదు కాగా, 11 మందిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు కియా పీఎస్ ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. వివరాలు... పెనుకొండ మండలం మునిమడుగు గ్రామానికి చెందిన ఓ వివాహితపై గత బుధవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందనే అపోహతో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేసి జుత్తు కత్తిరించి అవమానించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు డి.శంకర, లక్ష్మీదేవి, రామస్వామితో పాటు సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ, రమేష్, శాంతి, ధనలక్ష్మి, రమణ, సుందరమ్మ, అనితను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment