సీసీ రోడ్డుపై వాటర్ ప్లాంట్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పెచ్చు మీరాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములు, స్థలాలు, చివరకు ప్రైవేటు ఆస్తులతో పాటు శ్మశాన స్థలాలను సైతం వదలకుండా ‘పచ్చ’ నేతలు కబ్జా చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు మండలంలోని గొందిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేత కుమ్మర నాగేంద్ర మరింతగా బరితెగించాడు. ఏకంగా సీసీ రోడ్డును కబ్జా చేసి వాటర్ ప్లాంట్ నిర్మించాడు. ఎన్‌టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ అని పేరు కూడా పెట్టాడు. భవనంపై ఎన్‌టీఆర్, చంద్రబాబు, లోకేష్, పరిటాల రవి, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్ధ, ఎమ్మెల్యే సోదరుడు ధర్మవరపు మురళీ ఫొటోలు వేయించాడు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా, పొందలేదు. రోడ్డుపై ప్లాంట్ నిర్మించకూడదంటూ గ్రామ ప్రజలు అడ్డు పడితే తీవ్రంగా బెదిరించాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాంటు ఏర్పాటు చేయడంతో సర్పంచు మిడతల శీనయ్య అనుమతి ఇవ్వలేదు. శీనయ్య టీడీపీ సానుభూతి పరుడే కావడం గమనార్హం. దీన్ని బట్టి నాగేంద్ర ఎంతలా బరితెగించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సీసీ రోడ్డుపై నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
‘పచ్చ’ నేత బరితెగింపు
Comments
Please login to add a commentAdd a comment