‘విశ్వ’తేజం.. తగ్గుతున్న వైభవం
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 90 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ఇప్పటికే 40 కళాశాలలకు అటానమస్ హోదా దక్కింది. తక్కిన 50 కళాశాలల్లో సింహభాగం వచ్చే ఏడాది
అటానమస్ హోదా పొంద నున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారాలు కనుమరుగవుతాయి. జిల్లాలో రెండింటికి మినహా అన్ని కళాశాలలకూ అటానమస్ హోదా దక్కింది. ఆ రెండు కూడా ‘అటానమస్’కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
నూతన విద్యా విధానంతో బాటలు..
నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలకు అటానమస్ హోదా ఉండాలి. గతంలో ఆ హోదా దక్కాలంటే శాశ్వత అనుబంధ హోదాతో పాటు న్యాక్‌లో మెరుగైన గ్రేడింగ్ దక్కించుకోవాల్సి ఉండేది. అయితే, నూతన విద్యా విధానంలో భాగంగా నిబంధనలు సరళీకరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి కళాశాలకూ అటానమస్ హోదాను కట్టబెడుతున్నారు. అటానమస్ అయితే విద్యా ప్రణాళిక, సిలబస్ రూపకల్పన, ప్రోగ్రాం అమలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పరీక్ష ఫలితాల విడుదల వరకు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. మార్కు లను వర్సిటీకి పంపితే.. స్నాతకోత్సవ డిగ్రీని వర్సిటీ తన పేరున ప్రదానం చేస్తుంది.
ప్రైవేట్ వర్సిటీల బాటలో..
పలు ఇంజినీరింగ్ కళాశాలలు ప్రైవేట్ వర్సిటీలుగా మారేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. కోర్సుల ఫీజులను కూటమి ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో చాలా కళాశాలలు ఆ బాట పట్టినట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ వర్సిటీగా మారితే సీట్ల పెంపు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకునే అవకాశం లభిస్తుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుంది. ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ, మార్క్స్‌కార్డుల జారీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేసుకునే అధికారం ప్రైవేట్ వర్సిటీకి ఉంటుంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు ‘యూజీసీ’ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) సైతం సుముఖంగా ఉంది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో ఇప్పటికే మోహన్‌బాబు, అన్నమాచార్య ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. మిట్స్ (మదనపల్లి), ఆర్జీఎం (నంద్యాల), పుల్లారెడ్డి (కర్నూలు), ఆదిశంకరాచార్య, ఎస్వీ సెట్ (చిత్తూరు), కేఎస్‌ఆర్‌ఎం (కడప), ఎస్వీ ఐటీ (తిరుపతి) కళాశాలలు ప్రైవేట్ వర్సిటీలుగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నాయి.
సొంతంగా ఫీజుల నిర్ణయం..
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేస్తుంది. కానీ, ప్రైవేట్ వర్సిటీలు స్వతహాగా ఫీజులను నిర్ణయించుకోవచ్చు. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చు. కేవలం 30 శాతం విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తుంది. ప్రైవేటు వర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ కూడా ఎక్కువగా ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేది. కూటమి ప్రభుత్వంలో సకాలంలో ఫీజులు అందడం ప్రశ్నార్థకంగా మారడంతో ప్రైవేటు వర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జేఎన్‌టీయూ పరిధిలో అనుబంధ కళాశాలలకు అటానమస్
ఇప్పటికే 40 కాలేజీలకు మంజూరు.. వచ్చే ఏడాది మరిన్నింటికి హోదా
నూతన జాతీయ విద్యా విధానంలో వెసులుబాటే కారణం
త్వరలో పర్యవేక్షణ వరకే
పరిమితం కానున్న వర్సిటీ
రాయలసీమకే తలమానికంగా నిలిచి.. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది దేశంలోనే
తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జేఎన్‌టీయూ (ఏ) వైభవం
క్రమంగా తగ్గుతోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇంజినీరింగ్ కళాశాలలు అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా
పొందుతుండటంతో వర్సిటీ పరిధి కుంచించుకుపోతోంది. త్వరలో కేవలం కాగితాలకే కార్యకలాపాలు పరిమితం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment