పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న కనపల అమృత(17) ప్రహారాజపాలేంలో ఉన్న గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో సోమవారం ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ మహమ్మద్ యాసీన్ తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం దిమ్మిడిజోల గ్రామానికి చెందిన కనపల అమృత పాతపట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ప్రహరాజపాలేం ఉన్న గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో నివాసముంటోంది. ఫస్టియర్‌లో నాలుగు సబ్జెక్టులు తప్పింది. మళ్లీ రాసినా ఫెయిలైంది. ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇటీవలే విద్యార్థిని సెలవులకు దిమ్మిదిజోల వెళ్లి రెండు రోజులు ఉండి, ఆ తర్వాత గంగువాడ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చింది. విద్యార్థులంతా కాలేజీకి వెళ్లిపోవడంతో తనతో పాటు తెచ్చుకున్న అమ్మ చీరతో గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 10 గంటల సమయంలో మరో విద్యార్థిని హాస్టల్‌కు వచ్చి చూడగా అమృత ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో వెంటనే వసతిగృహం సిబ్బంది తెలియజేసింది. వార్డెన్ ఝాన్సీ 108కు ఫోన్ చేసి, పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.
108 సిబ్బంది వచ్చేసరికే అమృత మృతి చెందింది. సంఘటన స్థలానికి ఎస్‌ఐ మహమ్మద్ యాసీన్, తహసీల్దార్ రవిచంద్రలు చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి తోటి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించి, పోస్టుమార్టం చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థినికి తండ్రి కనపల కన్నారావు, తల్లి ఇంద్రరాణి, తమ్ముళ్లు అభిషేక్, అనిరుద్దీన్‌లు ఉన్నారు. దసరా సెలవుల్లో ఇంటిలో సందడిగా తిరిగిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి మిన్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment