మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుచేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన తెలియజేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వాబయోగి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో గిరిజనులకు న్యాయం చేసేలా మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు తీర్మానం చేయాలని కోరారు. సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిపోవడంతో వివిధ పనుల కోసం వ్యయప్రయాసలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా విభజన సమయంలోనే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా తమ ప్రభుత్వం వచ్చాక మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు సైతం ప్రతిపక్ష నేత హోదాలో పాతపట్నం బహిరంగ సభలో శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. తక్షణమే ఐటీడీఏ ఏర్పాటుచేయకుంటే ఆదివాసీ ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మెళియాపుట్టి మండల అధ్యక్షుడు గణేష్, బూర్జ మండల అధ్యక్షుడు సవర శోభన్, సవర కృష్ణ, సారవకోట మండల అధ్యక్షుడు భాస్కరరావు, దీనబందిపురం సర్పంచ్ వెంకటేష్, సభ్యులు ఈశ్వరరావు, లచ్చుమయ్య, హరీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment