ఆటకట్టు
బైక్ చోరీ గ్యాంగ్
పట్టుబడిన ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న
ఎస్పీ మహేశ్వరరెడ్డి. చిత్రంలో డీఎస్పీ వివేకానంద
శ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా బైక్‌చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను ఆమదాలవలస పోలీసు లు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 15.5 లక్షల విలువైన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీలే కాక బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లు, వైన్‌షాపు రోబరీల్లో నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ నేరాలతో సంబంధమున్న మరో వ్యక్తి గంజాయి కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
గత నెల 5వ తేదీ రాత్రి ఆమదాలవలసకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కరణం శ్రీనివాసరావు తన ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని గు ర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ కె.వెంకటేష్‌లు తమ సిబ్బందితో కలసి దర్యాప్తు కొనసాగించారు.
విచారణ కొనసాగించగా..
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి అర్జునరావు (37) దివ్యాంగుడు కావడం, ఏ పనిచేయక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇతనికి ఆమదాలవలస కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్, పలాస మండలం అంబుసోలికి చెందిన జడ్యాడ సోమేశ్వరరావు (21), విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన సప్ప హరీష్ (21), ఆమదాలవలస మెట్టెక్కివలసకు చెందిన మదాసు ధనుష్ (19)లు పరిచయమయ్యారు.
పథక రచన చేశారిలా..
అర్జునరావు వీరందరికి ఖర్చులకు డబ్బులివ్వడమే కాక ఉండటానికి గది అద్దెకిచ్చి రాత్రి పూట బైక్, ఇతర చోరీలు ఎలా చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేవాడు. దొరికిన బైక్‌లను ఏపీలో అమ్మితే సమస్య అని, ఒడిశాలో అమ్మితే పోలీసులకు దొరికే అవకాశముండదని ఒడిశా గజపతి జిల్లా మినిగాన్‌కు చెందిన తన మిత్రుడు దారపు శేషగిరి (42) అతని బంధువైన ఏరుపల్లి బాలాజీ (తురకపేట)ల సాయంతో అమ్మేవారు.
పట్టుబడ్డారిలా..
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ గేట్ స్కూల్ కూడలి వద్ద ఎస్‌ఐ వెంకటేష్, తమ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో జడ్యాడ సోమేశ్వరరావుపై విజయనగరం బొబ్బిలిలో మూడు, కాశీబుగ్గ, ఆమదాలవలసల్లో ఒక్కొక్కటి చొప్పున పాత కేసు లుండగా సప్ప హరీష్‌పై బొబ్బి లిలో మూడున్నాయి. ఈ ఏడాది ఎన్డీపీఎస్ (గంజాయి) కేసులో అంపోలులో జైలుశిక్ష అనుభవిస్తున్న కారుణ్య జగదీష్‌పై బొబ్బిలిలో మూడు, ఆమదాలవలసల్లో నాలుగు కేసులుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment