రాబంధువులు
రీచుల్లో
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇసుక రీచులపై రా‘బంధువులు’ వాలుతున్నాయి. ర్యాంపుల్లో కాసుల వేట జరుగుతుండడంతో అధికార పక్ష నేతల బంధువులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలు కాకుండా ఉండేందుకు వీలుగా జిల్లాలో కొన్ని ఇసుక ర్యాంపులను లారీలకు లోడ్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో మండల పరిధిలోని గోపాలపెంట ఇసుక ర్యాంపు ఒకటి. దీన్ని ఎమ్మెల్యే బంధువులకే కట్టబెట్టారు. స్థానిక టీడీపీ కార్యకర్తలే అంతా చూస్తున్నారు. దీంతో తమకు అడ్డు లేదనుకొని ఇష్టానుసారంగా నిబంధనలు పక్కన పెట్టి ర్యాంపు నిర్వహిస్తున్నారు.
అంతటా నిబంధనల ఉల్లంఘనే..
గోపాలపెంట ర్యాంపులో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ వాల్టా చట్టాన్ని పట్టించుకోవడం లేదు. నదిలో ఇసుక లోడింగ్ మనుషుల ద్వారా చేయాలని ప్రభుత్వం చూచిస్తే యంత్రాలు వినియోగిస్తున్నారు. ఇక్కడ మూడు జేసీబీలు పనిచేస్తున్నాయి. రోజూ 23 ట్రాక్టర్లు వినియోగించి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు రోజుకు 10 లోడ్లు వేస్తుంది. వీరికి ఒక్కో లోడుకు రూ. 270 చెల్లిస్తున్నారు. నదిలోనికి ఇతరులు ఎవరూ వెళ్లకుండా ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు కాపలా కాస్తున్నారు. ర్యాంపు వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోతోంది. స్వయంగా ఎమ్మెల్యే బంధువులే ర్యాంపు నిర్వహిస్తుడంటంతో అధికారులు ఇటువైపు చూడనైనా చూడడం లేదు. లారీలతో పాటు ట్రాక్టర్లు తిరగడం వల్ల రోడ్డుపై ధూళి ఎగసిపడుతోంది. కనీసం వాటరింగ్ అయినా చేయడం లేదని గోపాలపెంట, పోతయ్యవలసలకు చెందిన పలు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పగలూ రాత్రి..
గోపాలపెంటలో ఇసుక ర్యాంపును అక్టోబరు 17న కలెక్టర్ ప్రారంభించారు. 24 వ తేదీ నుంచి అధికారికంగా ర్యాంపు నడుస్తోంది. సోమవారం నాటికి అధికారికంగా 78 లారీల ఇసుకను మాత్రమే విక్రయించారు. సెలవు రోజులు పోనూ ర్యాంపు పనిచేసిన రోజుల్లో సరాసరిన రోజుకు 6 లారీలు చొప్పున విక్రయాలు చేశారు. అయితే అనధికారికంగా వందల లోడ్లు తరలాయి. రాత్రి సమయాల్లో ఇసుక ర్యాంపు నిర్వహణకు అనుమతి లేకపోగా టీడీపీ కార్యకర్తలే అంతా తామై ఇసుకను రోజుకు పదుల సంఖ్యలో తరలిస్తున్నారు. అలాగే లారీల్లో పరిమితికి మించి లోడింగ్ చేస్తూ అదనపు ఇసుకకు వేరే రేటు తీసుకుంటున్నారు. ఉదాహరణకు పగలు కూడా ఒక లారీ 12 టన్నులకు డీడీ తీస్తే 20 టన్నుల వరకూ లోడింగ్ చేసి డబ్బులు అదనంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు వరకూ సచివాలయ సిబ్బందికి డ్యూటీలు వేశారు. వీరు వెళ్లిన తర్వాత వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంది. అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తనిఖీలు చేయడం లేదు.
మరో మూడు ర్యాంపుల స్వాధీనానికి ప్రయత్నాలు
మండలంలో మడపాం, కొబగాం వెంకటాపురం, ఉప్పరిపేట వద్ద మరో మూడు ర్యాంపులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ మేరకు జిల్లా ఇసుక కమిటీ షీల్డు టెండర్లును ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేసింది. వీటిని కూడా ఎమ్మెల్యే బంధువులు చేజిక్కించుకుని అందిన మేరకు లాగేయడానికి చూస్తున్నారు. స్వయానా ఎమ్మెల్యే భార్య బంధువులు రంగ ప్రవేశం చేసి పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం అంతా తమ కనుసన్నల్లోనే జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మండలంలోని టీడీపీ కేడరు, జనసేన కేడరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
గోపాలపెంట ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
పట్టించుకోని అధికారులు
ర్యాంపు నిర్వాహకులు టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే బంధువులే
అన్ని ర్యాంపులు చేజిక్కించుకోవడానికి చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే బంధువులు
Comments
Please login to add a commentAdd a comment