కష్టాలు అపార్‌ం
క్లాసులు దూరం..
శ్రీకాకుళం న్యూకాలనీ, శ్రీకాకుళం:
విద్యార్థులకు క్లాసులు సజావుగా సాగడం లేదు. ఆధార్ కేంద్రాల వద్ద విద్యార్థులు, సచివాలయాల వద్ద వారి తల్లిదండ్రులు, కంప్యూటర్ల వద్ద లెక్చరర్లు, ఉపాధ్యాయులకు రోజులు గడిచిపోతున్నాయి. ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ నంబర్‌ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించడం, ఆ మేరకు కసరత్తులు చేయకుండా స్కూళ్లకు టార్గెట్లు ఇవ్వడంతో అటు అపార్ నమోదు పూర్తి కాక ఇటు క్లాసులు సరిగా సాగక విద్యా సంవత్సరంలోని రోజులన్నీ వ్యర్ధమవుతున్నాయి.
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘అపార్’ పేరిట 12 అంకెలతో కూడిన ఒక నంబర్‌ను కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ‘వన్ నేషన్.. వన్ స్టూడెంట్’ నినాదంతో విద్యార్థులకు 12 అంకెలతో కూడిన ‘అపార్’ (ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్‌లో ఒక నంబర్‌ను కేటాయిస్తారు. యూడైస్ ప్లస్ వెబ్‌సైట్ వేదికగా జాతీయ స్థాయిలో అపార్ నంబర్ కేటాయించి విద్యార్థికి సంబంధించిన సమస్త సమాచారం అందులో నిక్షిప్తం చేయనున్నారు.
విద్యార్థులే బాధితులు..
అపార్ అందించే ప్రక్రియలో విద్యార్థులను ఆఖరికు బాధితులుగా చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థులను, పాఠశాల విద్యార్థులను ఇప్పుడు ‘అపార్’ కుదిపేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఏకంగా కలెక్టరే రోజువారిగా విద్యాసంస్థలకు టార్గెట్లను నిర్దేశిస్తుండటంతో అక్కడి ప్రిన్సిపాళ్లు/హెచ్‌ఎంలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో గత పదిరోజులుగా క్లాసులకు నోచుకోకుండా సచివాలయాలు, ఆధార్ కేంద్రాలు, నోటరీల కోసం అడ్వకేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీటన్నింటికీ ఈ పేద, మధ్య తరగతి విద్యార్థులు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు. మరోపక్క క్లాసులు జరగక సిలబస్‌లు పూర్తికావడంలేదు. దీనికి తోడు పరీక్షలు సమీపిస్తుండటంతో విలువైన సమయాన్ని నష్టపోతుండటంతో.. ఈ ప్రభావం పబ్లిక్ ఫలితాలపై తప్పకుండా పడతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
‘ఆ రెండే’ ప్రధాన సమస్య
పాఠశాల విద్యార్థులను అటుంచితే.. జూనియర్ కళాశాలల విద్యార్థుల సమస్య జటిలమైంది. వారికి పదో తరగతి మార్క్స్ మెమోకు, ఆధార్‌కార్డుకు 80 శాతం వరకు వ్యత్యాసాలు ఉండటంతో నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థి పేరు, వారి జనన తేదీ ఈ రెండే విద్యార్థుల పట్ల ప్రధాన సమస్యగా పరిణమించాయి. ఆధార్ మార్పులు జరగాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. దానికి ఎన్‌ఏసీ చేయించాలి. సచివాలయాల్లో ఎన్‌ఏసీ చేయించాలంటే అడ్వకేట్ ధ్రువీకరించే నోటరీ అవసరమవుతోంది. దీని తర్వాత మళ్లీ సచివాలయాల్లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీవోలు ధ్రువీకరించాలి. మళ్లీ ఆధార్ కేంద్రాల్లో నమోదు కావాలి. ఆ తర్వాత సచివాలయాల్లో డేటాను నమోదు చేసుకోవాలి. ఇంత తంతు జరిగితే తప్ప ఆధార్ కార్డులు జనరేట్ కావు. సచివాలయాల వారీగా విద్యార్థులతో లెక్చరర్లు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు. యూడైస్ అపార్ వెబ్‌సైట్‌లో మార్పులు చేయాల్సింది పోయి ఇంత తతంగాన్ని పెట్టించిన ప్రభుత్వం కనీసం విద్యార్థులకు ఉపశమనాన్ని కలిగించే నిర్ణయాన్ని తీసుకోక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాకు సంబంధించి..
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 2840 ఉండగా వీటిల్లో 3,21,200 మంది విద్యార్థులు చదువుతుంటే.. ఇప్పటి వరకు 2.10లక్షల మంది వరకు అపార్‌కార్డులు జనరేట్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన వారికి అనేక సమస్యల కారణంగా కార్డులు జనరేట్ కావడం లేదు.
విద్యార్థులను కుదిపేస్తున్న ‘అపార్’ నమోదు ప్రక్రియ
సచివాలయాలు, ఆధార్‌కేంద్రాలు, నోటరీల కోసం అడ్వకేట్ల చుట్టూ ప్రదక్షిణలు
అపార్ నమోదుకై రోజువారీ టార్గెట్లు ఇస్తూ ఒత్తిడికి గురిచేస్తున్న ప్రభుత్వం
లెక్చరర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సైతం తప్పని ఇబ్బందులు
విద్యార్థులకు ఉపశమనం కలిగేలా వెబ్‌పోర్టల్‌లో మార్పులు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment