గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గృహ నిర్మాణశాఖ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందుకు అనుగుణంగా జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5 వేల గృహాలు, ఏడాదిలోపు 35 వేల గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి రూఫ్ లెవెల్ పూర్తయిన భవనాల ను నూరు పూర్తి చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు రుణాలు ఇప్పించి వాటిని నిర్మాణాల కోసం వినియోగించుకునేలా చూడాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా గృహ లబ్ధిదారునికి 90 రోజుల పనిదినాలు కల్పించి వేతన లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్ పీడీ బి నగేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పురోగతిని వివరించారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా ఆవులు, ఎద్దులను తరలిస్తుండగా నరసన్నపేట పోలీసులు అడ్డుకున్నారు. బుధ, గురువారాల్లో తిలారు నుంచి బొలేరో వాహనాల్లో నాలుగు ఆవులు, ఎనిమిది ఎద్దులను జగ్గంపేటకు, కొత్తపేటకు తీసుకెళ్తున్నట్లు తెలుసుకుని కాపు కాసి పట్టుకున్నారు. ఆవులను, ఎద్దులను తరలిస్తున్న ద్వారపూడి మండలానికి చెందిన పోచిన నాగేంద్ర, అనకాపల్లి జిల్లా కె.కొట్టపాడు మండలం అలమండకు చెందిన జీలం శివకుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆవులను, ఎద్దులను కొత్తవలస గోశాలకు పంపామని తెలిపారు. రెండ బొలేరో వాహనాలను సీజ్ చేశామన్నారు.
టీచర్ నిజాయతీ
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల బైపల్లి గ్రామానికి చెందిన దున్న పుష్పలత పోగొట్టుకున్న 3 తులాల బంగారం ఆభరణా న్ని మామిడిపల్లి ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌వీ కృష్ణారావు గురువారం బాధితులకు అందించి తమ నిజాయతీని చాటుకున్నారు. పుష్పలత ఈ నెల 18న మార్కెట్ పనుల కోసం కాశీబుగ్గ వెళ్లి 3 తులాల బంగారం పుస్తెలతాడు పోగొట్టుకు న్నారు. ఈ బంగారం కృష్ణారావుకు దొరికింది. బంగారం పోయిన విషయాన్ని పుష్పలత కు టుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా పలు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న టీచర్ కృష్ణారావు వారికి ఫోన్ చేసి బంగారం తన వద్దే ఉందని చెప్పగా.. వారు గురువారం టీచర్ ఇంటి వద్దకు వచ్చి ఆభరణాన్ని తీసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏఏఐ బృందం స్థల పరిశీలన
వజ్రపుకొత్తూరు రూరల్/కాశీబుగ్గ: వజ్రపుకొత్తూరు, మందస మండలాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఐదుగురు సభ్యులతో కూడిన (ఏఏఐ) కేంద్ర బృందం స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన స్థలం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విమానశ్రాయ నిర్మాణానికి అయా మండలాల రెవెన్యూ పరిధిలో 1383.71 ఎకరాలు ఎంపిక చేసినట్లు, ఈ మేరకు స్థలాన్ని ఎంపిక చేసి నివేదికను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగానే చీపురపల్లి, మోట్టూరు, ఒంకులూరు, అనకాపల్లి, బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి యోగ్యత కలిగిన స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించామని తెలిపారు. అలాగే సెల్ టవర్లు, ఎత్తైన భవనాలు, కొండలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ జి.వెంకటేష్, వజ్రపుకొత్తూరు,మందస మండలాల తహసీల్దార్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment