నేడు జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ప్రాబబుల్స్ జట్లకు ఇదే మైదానంలో నాలుగు రోజులపాటు శిక్షణా శిబిరాలు నిర్వహించాక తుది జట్లను ప్రకటిస్తామన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు విజయవాడలో జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు వీరిని పంపిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్‌ఏ బాస్కెట్‌బాల్ కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి (సెల్: 99492 91288)ను సంప్రదించాలన్నారు.
గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో జరిగే 76వ గణతంత్ర వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డితో కలిసి వేడుకలు జరిగే శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానాన్ని పరిశీలించారు. 26న ఉదయం ఏడు గంటల నుంచి వేడుకలు మొదలవుతాయని చెప్పారు. కళాశాల మైదానం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు వేడుకలను తిలకించేలా సౌకర్యవంతమైన సిటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు, ఆహ్వానితుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రత్యేక స్టాళ్లు, శకటాలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటేశ్వరరావు, పద్మావతి, ఆర్‌డీఓ సాయిప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎస్పీ ిసీహెచ్ వివేకానంద, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, డీఎస్‌డీఓ శ్రీధర్‌రావు, ఆర్‌ఐఓ పి.దుర్గారావు పాల్గొన్నారు.
హిరమండలం రిజర్వాయర్‌లో చేపల వేటకు లైసెన్స్
● తొలిసారిగా నిర్వాసితులకు
అవకాశమిస్తూ జీఓ జారీ
అరసవల్లి: జిల్లా జీవనాడి వంశధార హిరమండలం రిజర్వాయర్‌లో చేపల వేటకు వీలుగా లైసెన్సింగ్ స్కీంను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని శంబర వెంగలరాయ రిజ ర్వాయర్ మాదిరిగానే...జిల్లాలో హిరమండలం రిజర్వాయర్‌లో తొలిసారిగా చేపల వేటకు లైసెన్స్‌లు జారీ చేస్తూ జీఓ 34ను విడుదల చేసింది. ఇకపై మత్స్యశాఖ తరఫున రిజర్వాయర్‌లో సీడ్ స్టాకింగ్ చర్యలు చేపట్టనున్నారు. వంశధార నిర్వాసితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులకు మాత్రమే ఈ లైసెన్సులు ఇచ్చేలా పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో హిరమండలంలో ఉన్న 8 మత్స్యకార సహకార సంఘాల సభ్యులకు రిజర్వాయర్‌లో వేట సాగించే అవకాశం దక్కనుంది. ఇందుకోసం ఆసక్తిగల వారు హిరమండలం మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ద్వారా లైసెన్స్‌లను పొందవచ్చునని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు తెలిపారు. నిర్వాసితులైన సభ్యులకు లైసె న్సింగ్ స్కీం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ భవనంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో 298 మందికి ఏడుగురు, సాయంత్రం సెషన్‌లో 295 మందికి ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులకు తనిఖీలు నిర్వహించాకే లోపలికి విడిచి పెడుతున్నారు.
జగదానంద కారకా..
టెక్కలి రూరల్ : అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో రామభక్తులు ర్యాలీ నిర్వహించారు. రైతుబజారు వరకు శ్రీరామ నామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్నం సుమారు ఐదు వేల మందికి అన్నదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment