సిద్ధం
సంబరానికి
కమ్మసిగడాం
● నేటి నుంచి శ్రీమహాలక్ష్మి తల్లి జాతర
● పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు
రణస్థలం: మండలంలోని కమ్మసిగడాం పంచాయతీలో వెలసిన శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర శుక్ర వారం నుంచి మొదలుకానుంది. ఏటా రథసప్తమి పురస్కరించుకొని పెళ్లి రాటతో మొదలై, తొలి రోజు శుక్రవారం అమ్మవారి కల్యాణం రాత్రి 9.20 గంటలకు జరిగిన తర్వాత మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికీ తొలిరోజు ఎడ్లబండిపై జాతరకు రావడం ఇక్కడి ప్రత్యేకత.
స్థల పురాణమిదే..
స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.. 1750 సంవత్సరంలో విజయనగరం రాజులు పాలిస్తున్న కాలంలో వారి సైన్యాలకు బొట్ల గురప్ప దొర, వెలిచేటి చినకూర్మరాయులు అధిపతులుగా ఉండేవారు. ఈ ప్రాంతంలో చాలామంది జమీందారులు సామంత రాజులుగా ఉండేవారు. కానీ శ్రీకాకుళాన్ని పాలిస్తున్న బాదుర్లాఖాన్, అబ్దుల్లాఖాన్ అనే మహమ్మదీయులు కప్పం చెల్లించడం లేదని విజయరామరాజు తమ సైన్యాధిపతులైన బొట్ల గురప్పదొర, వెలిచేటి చినకూర్మరాయులును రాయబారులుగా పంపించారు. కానీ వారు కప్పం చెల్లించకపోగా.. యుద్ధానికి కాలు దువ్వారు. ఈ యుద్ధంలో విజయనగరం సైన్యం ఓడిపోయింది. అవమాన భారంతో బొట్ల గురప్పదొర తన సొంత గ్రామం సంచాం వెళ్లకుండా మళ్లీ యుద్ధం చేసి గెలవాలని రణస్థలం మండలంలోని దేవరపల్లి వద్ద సైన్యానికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి మళ్లీ యుద్ధం ప్రకటించి గెలిచారు. ఓటమి బాధతో మహమ్మదీయులు మాటు వేసి గురప్ప దొరను హతమార్చారు. భర్త మరణవార్త విని ఇద్దరు భార్యల్లో ఒకరైన మహాలక్ష్మి సతీసహగమనం చేశారు. ఆమె ఆహుతయ్యాక చితిలో చీరచెంగు, పసుపు, కుంకుమ భరిణిలు కాలిపోకుండా కనిపించాయి. దీంతో ఆమెను దైవ స్వరూపిణిగా భావించి అక్కడే ఆలయాన్ని కట్టారు. అప్పటి నుంచి ఏటా జాతర చేస్తున్నారు. చీపురుపల్లి మండలంలోని పెదనడిపిల్లి గ్రామానికి చెందిన కన్నవారు చీర, శతమానం, అత్తవారి గ్రామమైన సంచాం నుంచి మేళం, బంటుపల్లి కుటుంబీకులు పల్లకి మీద వచ్చి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపిస్తారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీప కాంతులు, పలు సినీ, పౌరాణిక కళాకారుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment