20 గ్రామాలకు ముప్పు.. | - | Sakshi
Sakshi News home page

20 గ్రామాలకు ముప్పు..

Published Fri, Feb 7 2025 12:57 AM | Last Updated on Fri, Feb 7 2025 12:57 AM

20 గ్

20 గ్రామాలకు ముప్పు..

● థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పురుడు పోసుకుంటున్న ఉద్యమం

● ప్రాజెక్టు విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

● ఎవరూ ఆపలేరని రెచ్చగొడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

● సోంపేట, కాకరాపల్లి వేరు.. ఇక్కడ వేరు అని సమర్థన

● 20 గ్రామాలకు ప్రత్యక్ష ముప్పు

థర్మల్‌ క్రిటికల్‌ సూపర్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదిత భూములు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

ద్యమాల సిక్కోలు గడ్డపై మరో పోరాటం పురుడు పోసుకుంటోంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఒకప్పుడు సోంపేటలో జరిగిన పోరాటం జిల్లా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. బీల కోసం జరిగిన ఆ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో తంపర భూముల్లో కూడా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును తలపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సోంపేట ఉద్యమమే స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి ప్రజలు కూడా పోరుబాట పట్టారు. ఇప్పుడు అదే తరహా ఉద్యమం కొత్తగా జీవం పోసుకుంటోంది.

థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లపై తొలి నుంచీ డబుల్‌ గేమ్‌ ఆడుతున్న టీడీపీ కొత్తగా ఆమదాలవలస ని యోజకవర్గంలోని సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ. 30వేల కోట్లతో 3200 మెగావాట్ల థర్మల్‌ క్రిటికల్‌ సూపర్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించాలని చూస్తోంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రకటనలు కూడా చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే అంతు చూస్తామని బెదిరింపులకు కూడా దిగుతున్నారు. సోంపేట, కాకరాపల్లి పరిస్థితులు వేరని, ఇక్కడి పరిస్థితులు వేరని కూన చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం తమకు జరిగే నష్టంపైనే ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రోడ్డెక్కారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన కూడా తెలిపారు. అయినప్పటికీ కూన రవికుమార్‌ వెనక్కి తగ్గమని స్టేట్‌మెంట్లు ఇస్తుండటంతో మరో ఉద్యమానికి సిద్ధమని జనం ముఖ్యంగా ఆదివాసీలు చెబుతున్నారు.

ప్రాజెక్టు నేపథ్యమిది..

బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలో థర్మల్‌ క్రిటికల్‌ సూపర్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో గోపిదేవిపేట, మసానపుట్టి, బూర్జ మానుగూడ, జంగాలపాడు, బొడ్లపాడు, జేవీ పురం, అనంతగిరిపేట, వెన్నెలవలస 1– వెన్నెలవలస–2, తదితర గ్రామాల పరిధిలో ఈ ప్లాంట్‌ను రెండు విడతల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1600కు పైగా ఎకరాల్లో రూ. 30వేల కోట్ల వ్యయంతో 3200మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు అంచనాలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే సుమారుగా 18మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగం జరగనుండగా, సుమారు 12టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కోటి 40లక్షల లీటర్ల మేర హైస్పీడ్‌ డీజిల్‌ కావాల్సి ఉంటుందని ఆందోళనకారులు చెబుతున్నారు.

అనర్థమే అంటున్న స్థానికులు

ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే తమ భూములను కోల్పోవడమే కాకుండా మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12టీఎంసీల నీటిని వంశధార రిజర్వాయర్‌ నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే నాగావళి రిజర్వాయర్‌ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అదే జరిగితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంటుందని, పవర్‌ ప్లాంట్‌ నుంచి 40శాతం మేర వ్యర్థాలు విడుదలవుతాయని, భూగర్భ జలాల్లోకి వెళ్లి మానవాళికి ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.

ప్లాంట్‌ నిర్మాణం జరగనీయం

ప్రాణాలైనా అర్పిస్తాం గానీ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనీయం. పవర్‌ప్లాంట్‌ వల్ల 20 కిలోమీటర్ల వరకు రేడియేషన్‌ సమస్య ఉంటుంది. గిరిజనులమంతా ఏకతాటిగా వ్యతిరేకిస్తాం.

– బాడంగి సురేష్‌ దొర, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు

కలిసి పోరాడతాం

మేమంతా తరతరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నాం. మా బతుకులు నాశనం చేయొద్దు. మాకు ఏ ప్లాంట్‌ వద్దు. మా కొండ పోడు బాగు చేసుకుని బతుకుతాం. అంతా కలిసి పోరాడుతాం.

– సవర కుమారి, జంగాలపేట, బూర్జ మండలం

పోరాటాలకు సిద్ధం

సంతబొమ్మాళి మండలంలో ప్రజలంతా కలిసికట్టుగా తిరస్కరించిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను కూటమి ప్రభుత్వం ఇక్కడి ప్రజలపై రుద్దుతోంది. ఇక్కడ ప్లాంట్‌ కడితే పర్యావరణంతోపాటు, విద్యాలయాలు, ప్రజల ఆరోగ్యం, పంటలు నాశనమయ్యే ప్రమాదముంది. మేమంతా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం.

– చింతాడ రవికుమార్‌, వైఎస్సార్‌ సీపీ

ఆమదాలవలస నియోజకవర్గం ఇన్‌చార్జి

కూన రవికుమార్‌కే ఉపాధి

థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుతో యువతకు ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ చెబుతున్నారు. కానీ ఆయనకు మాత్రమే ఉపాధి దొరుకుతుంది. ఈ ప్లాంట్‌ వల్ల ఆయా గ్రామాలే కాదు చుట్టు పక్కల నియోజకవర్గాలన్నింటికీ ముప్పే. దీనిపై చంద్రబాబు కూడా ఆలోచించాలి. – సనపల సురేష్‌, బూర్జ

ఇక్కడ ఏర్పాటు చేయబోయే పవర్‌ ప్రాజెక్టుతో 20 గ్రామాలకు ముప్పు ఉంటుందని, ఆదివాసీ గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంటుందని, పోడు వ్యవసాయం చేసే ఆదివాసీలు భృతిని కోల్పోతారని, పక్కనున్న గ్రామాలకు కూడా నష్టమేనని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వెన్నెలవలసలో ఉన్న విద్యాలయాలన్నీ తరలిపోక తప్పదనే భయాందోళనలో ఉన్నారు. పాతపట్నం, రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గ ప్రజలపై కూడా ప్రభావం చూపనుందని వాపోతున్నారు. ఇప్పటికే ప్రభావిత గ్రామ ప్రజలు సమావేశాలు పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
20 గ్రామాలకు ముప్పు..1
1/5

20 గ్రామాలకు ముప్పు..

20 గ్రామాలకు ముప్పు..2
2/5

20 గ్రామాలకు ముప్పు..

20 గ్రామాలకు ముప్పు..3
3/5

20 గ్రామాలకు ముప్పు..

20 గ్రామాలకు ముప్పు..4
4/5

20 గ్రామాలకు ముప్పు..

20 గ్రామాలకు ముప్పు..5
5/5

20 గ్రామాలకు ముప్పు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement