అతివేగానికి ఇద్దరు యువకులు బలి
ఎచ్చెర్ల క్యాంపస్ : అతివేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇరు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చారు. బుధవారం అర్థరాత్రి అల్లినగరం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 100 మీటర్ల వరకు బైక్ ఎగిరిపడింది. వాహనచోదకులు గుర్తించి అత్యవసర సర్వీసులకు ఫోన్ చేయడంతో అంబులెన్స్, పోలీసులు చేరుకున్నారు. మృతులిద్దరూ శ్రీకాకుళం పట్టణంలోని ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన దీర్ఘాసి కార్తీక్ (21), గుజరాతిపేట సమీపంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన పండా తరుణ్ (19)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వీరు విశాఖపట్నం వైపు నుంచి వస్తున్నారు. అర్థరాత్రి ఎందుకు వస్తున్నారనే విషయం తెలియలేదు. వీరిద్దరూ స్నేహితులు. స్పోర్ట్సు బైక్ అతి వేగంగా నడపటం, హెల్మెట్ సైతం పెట్టకపోవటం, బలంగా డివైడర్‌ను ఢీకొట్టడం వల్ల యువకులు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కార్తీక్ బైక్ నడుపుతున్నట్లు సమాచారం. ఇద్దరు యువకులు పేద కుటుంబానికి చెందిన వారు. కార్తీక్ టైర్ బండితో ఇసుక తరలిస్తూ జీవనం సాగిస్తుండగా, తరుణ్ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తున్నాడు. మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.సందీప్‌కుమార్ చెప్పారు.
అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్
ఘటనా స్థలంలోనే మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment