ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ఇప్పటి వరకు వివిధశాఖల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వచ్చే వారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తుల స్థితిగతులను వివరించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలించాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 16 దరఖాస్తులు, డీడబ్ల్యూఓ 4, డీఆర్‌డీఓ 6, డీపీఓ 1, డీఏఓ 7, ఇతర శాఖలకు సంబంధించి 24 ఇలా మొత్తం 58 దరఖాస్తులు అందాయని వీటిని సంబంధిత శాఖలకు పంపినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అప్పారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, లత, బీసీ వెల్ఫేర్ అధికారి అనసూర్య, డీసీఓ పద్మజ, డీపీఓ నారాయణ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment