వేలం ధాన్యం ఇస్తలేరు!
కోదాడ: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం వేలం వేసినా తిరిగి ఇవ్వకుండా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. బియ్యం ఇవ్వమంటే.. ధాన్యం నాణ్యతగా లేదు.. మేము బియ్యం ఇవ్వలేం.. మీ ధాన్యం మీరే తీసుకెళ్లండి అని మిల్లర్లు ఇంతకాలం చెబుతూ వచ్చారు. అయితే ఇచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేసింది. వేలంలో ధాన్యం దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఈ నెల 31 వరకు అప్పగించాల్సి ఉంది. ధాన్యం అప్పగిస్తేనే ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తానని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. కానీ, మిల్లర్లు మాత్రం ఆ ధాన్యాన్ని కాంట్రాక్టర్కు అప్పగించమంటే మా వద్ద ధాన్యం లేదంటున్నారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఖాతరు చేయకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
నెలలు గడుస్తున్నా..
2022–23 యాసంగి సీజన్లో సీఎంఆర్ కోసం ప్రభుత్వం ధాన్యం సేకరించి జిల్లాలోని 53 మిల్లులకు అప్పగించింది. ఈ ధాన్యం మర ఆడించి కొంత మంది మిల్లర్లు బియ్యం అప్పగించగా ఎక్కువ మంది ఇవ్వకుండా సతా యిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం జనవరి నెలలో మిల్లులో ఉన్న ధాన్యం వేలం వేసిన ప్రభుత్వం వేలందారులకు అప్పగించాలని నిర్ణయించింది. సదరు కాంట్రాక్టర్ వేలం ధాన్యం తీసుకొని పోవడానికి వస్తే చాలా మిల్లుల్లో ధాన్యమే లేదు. అప్పటికే ఆ ధాన్యం మర ఆడించి బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలం వేసి 11 నెలలు గడుస్తున్నా కొందరు మిల్లర్లు మాత్రమే ధాన్యం బదులు కాంట్రాక్టర్కు నగదు చెల్లించి బయట పడ్డారు. ఇంకొందరు తమ వద్ద అరకొరగా ఉన్న ధాన్యాన్ని అప్పగించి చేతులెత్తేశారు.
14 శాతమే అప్పగించారు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లకు 2022–23 యాసంగి సీజన్లో కేటాయించిన ధాన్యంలో బియ్యం ఇవ్వకుండా మిల్లుల వద్ద 2,98,259 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాలని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ధాన్యానికి జనవరి నెలలో వేలం వేయగా వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్కు కొద్దిపాటిగా అప్పగించారు. కానీ, ఒక్క మిల్లులో కూడా బస్తా ధాన్యం లేదని సమాచారం. వేలం వేసిన ధాన్యంలో మిల్లర్లు అప్పగించిన ధాన్యం కేవలం 14 శాతమేనని ఇంకా ఎనిమిది శాతం ధాన్యం మిల్లర్లు అప్పగించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు.
పదకొండు నెలలైనా పట్టించుకోని రైస్ మిల్లర్లు
ఫ వేలం ధాన్యం ఇచ్చేందుకు మిగిలింది తొమ్మిది రోజుల గడువే..
ఫ ఇప్పటి వరకు ఇచ్చింది 14 శాతమే
ఫ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
వేలం ధాన్యం వివరాలు (మెట్రిక్ టన్నుల్లో..)
మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యం 2,98,259
వేలందారుడికి ఇచ్చింది 43,039
ఇంకా ఇవ్వాల్సింది 2,55,220
ధాన్యం నిల్వలు తనిఖీ చేయకుండానే వేలం
కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన పౌరసరఫరాల శాఖ అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. ధాన్యం వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో అసలు మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఉన్నాయో..? లేవా..? అని చూడకుండా కేవలం తాము కేటాయించిన ధాన్యం.. వారు తిరిగి బియ్యం ఇచ్చిన ధాన్య పోగా మిగిలిన ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్లు కాగితాల మీద లెక్కలు చూపారు. మిల్లుల్లో ధాన్యం లేదని తెలిస్తే అది తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు లేని ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నట్లు చూపి వేలం వేశారు. వాస్తవానికి అక్కడ ఎలాంటి ధాన్యం లేదన్న విషయం అధికారులకు ముందే తెలుసని, దీనిపై విచారణ జరిపిస్తే అధికారుల తప్పిదాలన్నీ బయట పడతాయని పలువురు మిల్లర్లే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment