జనవరి 1 నుంచి గోదావరి జలాలు
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కు గాను జిల్లాకు గోదావరి జలాల విడుదలకు నీటి పారుదల శాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. వారబందీ విధానం (వారం విడిచి వారం) పద్ధతిన పంటలకు నీరివ్వాలని నిర్ణయించారు. వచ్చే నెల జనవరి 1 నుంచి 7 వరకు జిల్లాకు గోదావరి జలాలు రానున్నాయి. ఆతర్వాత వారం మొదటి దశకు విడుదల చేస్తారు. తిరిగి జనవరి 15న ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది మార్చి నెల వరకు జిల్లా గోదావరి జలాలు రానున్నాయి.
మూడు నియోజకవర్గాలకు..
సూర్యాపేట జిల్లాలోని ఎస్సారెస్పీ రెండవ దశలో ఉన్న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు కోదాడ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు గోదావరి జలాలు అందనున్నాయి. అయితే రెండవ దశ కింద జిల్లాలో సుమారు 2.50లక్షల ఆయకట్టు ఉంది. ఇప్పటికే కొందరు రైతులు వరినార్లు పోసుకోగా మిగిలిన రైతులు నీటి విడుదల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. షెడ్యూల్ రావడంతో రెండవ దశ ఆయకట్టు పరిధిలోని రైతులు పనులు ముమ్మరం చేయనున్నారు. కాగా గత ఏడాది ఈ సమయానికి గోదావరి జలాలను విడుదల చేయగా ఈసారి కొంత ఆలస్యంగా నీటిని వదులుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం వారబందీ విధానంలో జిల్లాకు గోదావరి జలాలు రానున్నాయని బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. పంటలకు వారబందీ విధానంలో నీళ్లు చాలవని పంటలు చేతికొచ్చే వరకు నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫ నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించిన ఇరిగేషన్ శాఖ అధికారులు
ఫ వారబందీ పద్ధతిన వదిలేలా చర్యలు
ఫ వచ్చే ఏడాది మార్చి వరకు నీరు
Comments
Please login to add a commentAdd a comment